Kidnap | శేరిలింగంపల్లి, జనవరి 7: బాబాయ్ బిడ్డను సొంత చెల్లి కంటే ఎక్కువ ప్రేమగా చూసుకున్నాడు. అవసరాల్లో ఆదుకున్నాడు. ఖరీదైన కానుకలు ఇచ్చాడు. కానీ, ఆ చెల్లి ప్రియుడితో కలిసి అన్న కిడ్నాప్‌కు ప్లాన్ చేసింది. రూ.2 కోట్లు దోచేందుకు కుట్ర పన్నింది. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో మా దాపూర్ ఇన్చార్జి డీసీపీ శ్రీనివాస్‌రావు ఆదివారం కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఖమ్మం జిల్లాకు చెందిన గుర్రం సురేందర్ (35) భార్య, కుమారుడితో కలిసి హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ 6వ ఫేజ్‌లో నివాసం ఉంటున్నారు. సురేందర్ ఓ సాఫ్ట్వేర్ సంస్థలో, ఆయన భార్య ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. సురేందర్ బాబా యి కూతురు అయిన గుర్రం నిఖిత గచ్చిబౌలిలోని ఓ సం స్థలో ఉద్యోగం చేస్తున్నది. తనతోపాటు పనిచేసే కృష్ణా జిల్లా కు చెందిన బల్లిపార వెంకటకృష్ణ (28)ను నిఖిత ప్రేమించింది. పెండ్ల్లిచేసుకొని విలాసవంతమైన జీవితం గడిపేందుకు డబ్బు కావాలని, ఇందుకోసం ఏదైనా చేయాలని ఇద్దరూ భావించారు. ఆర్థికంగా స్థిరపడిన తన అన్న సురేందర్‌ను కిడ్నాప్ చేయాలని ప్రియుడు వెంకటకృష్ణతో కలిసి నిఖిత కుట్ర పన్నింది.
వెంకటకృష్ణ తన పాత స్నేహితుడు, అత్తాపూర్‌కు చెందిన నేరస్థుడు గుంజపోగు సురేశ్‌ను నిఖితకు పరిచయం చేశాడు. వీరు ముగ్గురు కలిసి సురేందర్ కిడ్నాప్‌కు ప్లాన్ చేశారు. సురేశ్‌తోపాటు మోహిదీపట్నం అంబేద్కర్‌నగర్‌కు చెందిన రామగళ్ల రాజు(20), బోజగుట్టకు చెం దిన షిండే రోహిత్ (19), కడ్తాల్‌కు చెందిన చందు, రాజేంద్రనగర్వాసి వెంకట్ ముఠాగా ఏర్పడ్డారు. కొత్త ప్రదేశానికి సురేందర్‌ను తీసుకురావాలని నిఖితకు సురేశ్ సూచించా డు. ప్లాన్‌లో భాగంగా ఈ నెల 4న సురేందర్‌కు ఫోన్‌చేసిన నిఖిత.. ఆఫీస్‌లో ఓ వ్యక్తి తనను ఇబ్బంది పెడుతున్నాడని, ఖాజగూడ లింకురోడ్డు వద్దకు రావాలని నమ్మించింది. సా యంత్రం 6:30 గంటలకు ఖాజగూడ లింకురోడ్డు వద్దకు వచ్చిన సురేందర్ నిఖితతో మాట్లాడుతుండగా, స్విప్టు డిజైర్ కారులో వచ్చిన సురేశ్ గ్యాంగ్ అతడిని బలవంతంగా కారులో కుక్కి ఉడాయించారు.
స్థానికుల చైతన్యం.. బెడిసికొట్టిన పన్నాగం
గమనించిన స్థానికులు డయల్ 100కు ఫోన్ చేసి కిడ్నా ప్ గురించి చెప్పారు. కాసేపటికే అక్కడకు చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు అక్కడే ఉన్న నిఖితను ప్రశ్నించారు. తనకు తెలియదని బుకాయించింది. తర్వాత తన అన్న సురేందర్‌ను ఎవరో కిడ్నాప్ చేశారని రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యా దు చేసింది. అప్రమత్తమైన పోలీసులు ఆరు బృందాలను రంగంలోకి దించారు. ఇంతలోనే సురేశ్ గ్యాంగ్ సురేందర్ భార్యకు ఫోన్‌చేసి ‘నీ భర్తను కిడ్నాప్ చేశాం.. విడిచిపెట్టాలంటే రూ.2 కోట్లు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. అనివార్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని, పోలీసులు గాలిస్తున్నారని సురేందర్‌కు నిఖిత సమాచారం అందించింది. కంగుతిన్న గ్యాంగ్ మరి కాసేపటికి ఫోన్‌చేసి రూ.1 కోటి ఇస్తే చాలని, ఇంకాసేపటికి రూ.20 లక్షలు ఇచ్చినా చాలని సురేందర్ భార్యకు తెలిపారు.
కడ్తాల్-ఆమనగల్ రహదారిలో కారులో వెళ్తుండగా కిడ్నాపర్ల కారు బ్రేక్‌డౌన్ అయింది. సురేశ్ నిఖితకు కాల్చేసి వెంటనే ఓ కారు పంపించాలని చెప్పడంతో వెంకటకృష్ణ కారుతో కిడ్నాపర్ల వద్దకు చేరుకున్నాడు. అప్పటికే భయపడిన గ్యాంగ్‌లో ఇద్ద రు వెంకట్, చందు తప్పుకున్నారు. సురేశ్, వెంకటకృష్ణ, రాజు, రోహిత్.. సురేందర్‌ను ఎక్కించుకుని శ్రీశైలం వెపు వెళ్లారు. మార్గమధ్యంలో ఆత్మకూరు అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద అక్కడి సిబ్బంది కారును అపేందుకు ప్రయత్నించగా కంగారుపడ్డ గ్యాంగ్ కారును డీవైడర్కు ఢీకొట్టారు. సురేందర్ హెల్ప్.. అంటూ గట్టిగా అరవడంతో కారు అక్కడే వదిలేసి సురేశ్ గ్యాంగ్ అడవిలోకి పారిపోయింది. రాయదుర్గం పోలీసుల బృందం అక్కడకు చేరుకొని అటవీశాఖ సిబ్బందితో కలిసి సురేశ్, వెంకటకృష్ణ, రాజు, రోహిత్‌ను పట్టుకున్నారు. నిఖితను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిఖిత ప్రియుడిదీ నేరచరిత్రేనని పోలీసులు వెల్లడించారు.