హనుమకొండ, ఆగస్టు8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ బీసీలను మరోసారి వంచించిందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. మాట మార్చడం, మడమ తిప్పడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందని అన్నారు. లెక్కలేనన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అన్ని వర్గాలను మోసం చేస్తున్నదని దుయ్యబట్టారు. తాజాగా బీసీలను మరోసారి మోసం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్‌తో కలిసి మధుసూదనాచారి శుక్రవారం హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం కోటా విషయంలో రేవంత్ మరోమారు మోసం చేశారని అన్నారు. 42 శాతం బీసీ కోటాపై బీఆర్ఎస్ చిత్తశుద్ధితో ఉన్నదని స్పష్టంచేశారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చితేనే బీసీలకు 42శాతం కోటా సాధ్యమవుతుందని చెప్పారు.
రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకకపోతే దానికి బీఆర్ఎస్ కారణమని సీఎం మాట్లాడటంపై తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి ఆయన సొంతపార్టీ నేతలే అపాయింట్మెంట్ ఇవ్వడంలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు సోనియా, రాహుల్, ఖర్గే ఢిల్లీలో ఆ పార్టీ చేసిన బీసీ కోటా ధర్నాకు రాలేదని, రేవంత్‌రెడ్డికి రాహుల్‌గాంధీ అపాయింట్ ఇవ్వలేదని, దీనికి ఎవరు కారణమో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ డిక్లరేషన్ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ వర్గాలను మోసం చేస్తున్నదని విమర్శించారు. బీసీలు శక్తిగా మారాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో భూకంపం స్పష్టిస్తామని ప్రకటించిన రేవంత్.. తన డొల్లతనాన్ని చూపించాడని అన్నారు. రేవంత్‌రెడ్డి కేంద్రాన్ని, అన్ని పార్టీలను ఒప్పించే ప్రయత్నం చేయకుండా రెచ్చగొడుతూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్‌గాంధీ ప్రధాని అయితేనే బీసీ కోటా సాధ్యమవుతుందని రేవంత్‌రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉన్నదని చెప్పారు. రాహుల్‌గాంధీ ఎప్పుడు ప్రధానమంత్రి కావాలి? బీసీ కోటా ఎప్పుడు రావాలి? అని ప్రశ్నించారు. సందర్భం ఏదైనా కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి ఇంగితం లేకుండా మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు.