హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల గందరగోళానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే బీసీలను మోసం చేయడమే కనిపిస్తుందని చెప్పారు. తెలంగాణ భవన్లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమిళనాడు తరహాలో తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవోల ద్వారా బీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదు కాబట్టి.. రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీలకు రిజర్వేషన్లు వస్తాయని, ఆ దిశగా కృషి చేయడంలో కాంగ్రెస్ ప్రభు త్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బీసీ అండగా బీఆర్ఎస్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న తలపెట్టిన బీసీల నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతు ప్రకటించిందని మధుసూదనాచారి చెప్పారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ నేతల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయినప్పుడే బీసీలకు రిజర్వేషన్లు తెచ్చుకుంటామన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తర్వాత అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లకుండా, కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో ధర్నాలతో సాధించిందేంటి? అని ప్రశ్నించారు.
కేంద్రమంత్రిగా బీసీల కోసం కేసీఆర్ కృషి!
ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే బీసీల కోసం కృషి చేశారని, ఆనాడే బీసీ సంఘాల నాయకులను ప్రధానమంత్రి వద్దకు తీసుకెళ్లారని మధుసూదనాచారి గుర్తుచేశారు. తాను స్పీకర్‌గా ఉన్న సమయంలోనే బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన చరిత్ర కేసీఆర్‌కు దక్కుతుందని చెప్పారు. తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్‌గా తనకు అవకాశం కల్పించారని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా క్యాబినెట్ హోదా గల 3 పదవుల్లో రెండు పదవులను బీసీలకు ఇచ్చారని తెలిపారు.
దొంగే.. దొంగ అన్నట్టు ఉంది
దొంగే.. దొంగా దొంగా అన్నట్టుగా కాంగ్రెస్ పరిస్థితి ఉన్నదని, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఎవరి ప్రయోజనాల కోసం బీఆర్ఎస్పై నిందలు వేస్తున్నారని మధుసూదనాచారి ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను బీఆర్ఎసే అడ్డుకుంటున్నదన్న పీసీసీ చీఫ్ వ్యాఖ్యలను ఖండించారు. మహేశ్‌కుమార్ నిలదీయాల్సింది బీఆర్ఎస్ను కాదని, రిజర్వేషన్లలో గందరగోళానికి కారకుడైన సీఎం రేవంత్‌రెడ్డిని అని స్పష్టం చేశారు. రిజర్వేషన్లపై స్టడీ కోసం తమంతా చన్నైకి వెళ్తే.. అక్కడా రేవంత్ కుట్ర చేశారని తెలిపారు.