హనుమకొండ చౌరస్తా, జనవరి 14: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన కొనసాగిస్తుందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ధ్వజమెత్తారు. బుధవారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడం రేవంత్ రెడ్డి జేజమ్మ తరం కూడా కాదన్నారు. కేసీఆర్ పాలనా సౌలభ్యం కోసం జిల్లాల విభజనను చేశారని, జిల్లాలను మార్చే దుర్మార్గానికి ఒడిగడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. చేతనైతే ఇచ్చిన హామీ ప్రకారం సాగు సాయాన్ని పెంచి అందించాలని, ఏదో ఒక సాకుతో జిల్లాలలో మార్పులు జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
భూపాలపల్లి జిల్లాలో మార్పులు జరుగుతే తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజల కోసం పోరాడే పార్టీ బీఆర్ ఎస్ పార్టీ అని గుర్తుచేశారు. గతానికి అదనంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యతగల ప్రభుత్వం దానికి భిన్నంగా జిల్లాలు కుదిస్తాం, మార్చేస్తాం అనే బాధ్యతారాహిత ప్రకటనలతో గందరగోళం సృష్టించి వారి ఉపాధి అవకాశాలను దెబ్బతీయడం అత్యంత దుర్మార్గమన్నారు. సమావేశంలో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతం సదానందం, కార్పొరేటర్లు సోదా కిరణ్, నాయకులు ఇమ్మడి రాజు, శోభన్, సల్వాజీ రవీందర్ రావు, పానుగంటి శ్రీధర్, ఎండీ గౌస్ఖాన్, ఏలిషా, సౌరం రఘు, సంపతి రఘు, ఎస్కే మహిమూద్, తక్కళ్లపల్లి వినీల్ రావు, ఇమ్మడి స్నేహిత్, జేకే పాల్గొన్నారు.