హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే లెక్కలు తప్పుల తడకగా ఉన్నాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తంచేశారు. సర్వేలో జనాభా లెక్కలు కూడా తగ్గాయని, లోపాలను గుర్తించి, వాటిని సవరించేందుకు మళ్లీ సర్వే జరపాలని సూచించారు. ఈ లెక్కలు కాంగ్రెస్‌కు బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధిని వెల్లడిస్తున్నాయని ఎద్దేవా చేశారు. మంగళవారం శాసనమండలిలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే-2024 నివేదికపై చర్చ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన అంశంపై సాధారణ చర్చ కాకుండా సుదీర్ఘ చర్చకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు రావాలని కోరారు. బీసీల హక్కులు, అవకాశాలు, అభివృద్ధికి సంబంధించిన విషయంలో పూర్తి డాటా వివరాలు సభలో పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేవలం స్టేట్మెంట్ పెట్టి ప్రకటన చేస్తామనడంతో చిత్తశుద్ధిపై అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం సభ నిర్వహిస్తున్న తీరు దారుణంగా ఉన్నదని, కులగణనపై చర్చ అని చెప్పి, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణను కూడా చేర్చడమేమిటని ప్రశ్నించారు. సభ ప్రారంభమైన తర్వాత మళ్లీ షెడ్యూల్ మార్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వ్యవహరాలు బీసీ రిజర్వేషన్‌పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి నిదర్శనమని పేర్కొన్నారు.
కులగణనపై ప్రభుత్వ నివేదిక కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉన్నదని, ఇదేమి సర్వే అని మధుసూదనాచారి మండిపడ్డారు. కేవలం ఓసీ జనాభా పెరిగి బీసీ, ఎస్సీల జనాభా తగ్గడం ఏమిటని ప్రశ్నించారు. కులగణన లెక్కలు ఇవ్వకుండా క్లారిఫికేషన్లు మాత్రమే చెప్పాలనడం ఏమిటని నిలదీశారు. సర్వే వివరాలపై ఎన్నో అభ్యంతరాలున్నాయని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో పండుగ వాతావరణంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిందని, విదేశాల్లో ఉన్న తెలంగాణ వారు కూడా వచ్చి సర్వేలో పాల్గొన్నారని గుర్తుచేశారు. అప్పటి సర్వేతో పోల్చితే 2024 సర్వేలో బీసీ జనాభా 20 లక్షలు తగ్గిందని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా బీసీలు నష్టాపోతున్నామని గగ్గొలు పెడుతున్నారని చెప్పారు. బీసీల రిజర్వేషన్లు తగ్గించడానికే ఇలా నివేదిక రూపొందించారనే అనుమానాలున్నాయని పేర్కొన్నారు.
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే-2024 నివేదికపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తంచేశారు. మంగళవారం శాసనమండలి నుంచి వాకౌట్ చేశారు. కులగణన పేరుతో బీసీ హక్కులు కాలరాస్తున్నారని మధుసూదనాచారి ఆరోపించారు. అందుకే నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశామని తెలిపారు.