శాయంపేట, నవంబర్ 5: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అరాచక పాలన కొనసాగిస్తున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. మంగళవారం ఆయన హనుమకొండ జిల్లా శాయంపేటలో మీడియాతో మాట్లాడారు. గ్రామాల అభివృద్ధిలో పాలుపంచుకున్న మాజీ సర్పంచ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు.
ఇంత అరాచక పాలనను తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. లక్షల రూపాయల పెండింగ్ బిల్లులను కూడా చెల్లించలేని స్థితిలో ప్రభుత్వ ఉన్నదా? అని ప్రశ్నించారు. కొందరు కూలి పనులు చేస్తూ బతుకుతున్నారని, అభివృద్ధి పనుల కోసం బంగారం కుదువపెట్టి, స్నేహితుల వద్ద అప్పులు పనులు చేపట్టినట్టు తెలిపారు.
బిల్లులు చెల్లించకుంటే వాళ్లు ఎలా బతికేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వందల కోట్ల బకాయిలను బడాబాబులకు చెల్లిస్తూ మాజీ సర్పంచ్లకు మొండిచేయి చూపడం దారుణమని ప్రత్యామ్నాయ మార్గాలను చూపకపోగా బకాయిల కోసం రోడ్డెక్కితే రాత్రికి రాత్రే రాష్ట్రంలో ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు. మాజీ సర్పంచ్లకు మద్దతుగా వెళితే మూడు గంటలపాటు తిరుమలగిరి పీఎస్లో తమను అరెస్టు చేసి ఉంచారని, ప్రభుత్వం ఈ రకమైన తప్పులు చేయవద్దని హెచ్చరించారు. ప్రతిపక్ష నేతలుగా ప్రజల పక్షాన పోరాడుతామని చెప్పారు.