టేకుమట్ల, జనవరి 18: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ఆయనకు వెల్లంపల్లి శివారులో మహిళా రైతు కూలీలు తమ కష్టాలను చెప్పుకొన్నారు. కేసీఆర్ పాలనలో రైతుబంధు, నిరంతరం క రెంటు, సాగునీరు, ఎరువులు, విత్తనాలు సకాలంలో.. సరిపడా అంది రైతులు ఆనందంగా ఉండేవారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో యూరియా కొరత, నీటి సమస్య తీవ్రమై వ్యవసాయం చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మధుసూదనాచారి మాట్లాడుతూ.. యూరియా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. మంత్రులు రాష్ట్రంలో యూరియా సమస్య లేదని చెప్పడం రైతులను మోసం చేయడమే అవుతుందని మండిపడ్డారు.