మున్సిపల్ ఎన్నికలు కాగానే సీఎం రేవంత్ రూ.9వేల కోట్లు రైతు భరోసా వేస్తామంటున్నరు. ఇప్పుడు వేస్తే ఎవరు అడ్డు పడుతున్నారు. ఎన్నికలు ఉన్నాయని మాయమాటలు చెబుతున్నరు. రెండేండ్లలో ఇచ్చిన హామీలు బాకీ పడ్డారని ఓటు అడిగేందుకు వస్తున్న కాంగ్రెస్ నేతలను అడగండి. ఓటుకు వెయ్యి, రెండు వేలు ఇస్తరు. తీసుకొని మీకు బాకీ పడ్డ డబ్బులు ఎవరిస్తారని నిలదీయండి.
– కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 5(నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల టౌన్ : మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు సిరిసిల్ల కార్మికక్షేత్రం బ్రహ్మరథం పట్టింది. ప్రచారంలో భాగంగా ఓ సాధారణ వ్యక్తిలా పలు వార్డుల్లో కలియదిరిగిన రామన్నకు అడుగడుగునా అభిమానం వెల్లువెత్తింది. ఇటీవల మున్సిపాలిటీలో విలీనమైన ఒకటో వార్డు జ్యోతినగర్కాలనీ నుంచి ప్రచారం ప్రారంభించిన కేటీఆర్.. నేలపై కూర్చొని స్థానిక మహిళలతో ముచ్చటించారు. వారు చెప్పిన మాటలు, సమస్యలు ఓపిగ్గా విని పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఇస్తామన్న తులం బంగారం వచ్చిందా? మహిళలకు రూ.2,500 వచ్చినయా? అవ్వాతాతలకు రూ.4 వేలు పింఛన్ ఇచ్చిండ్రా? రైతుభరోసా ఏ సిండ్రా? అని అడిగారు. తన మీద కోపంతో సిరిసిల్ల జిల్లా తీసేస్తరట కదా అమ్మా అంటూ అడుగగా, అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆడబిడ్డలంతా ఒకసారిగా కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడ్డారు. తాము కారు గుర్తుకే ఓటేస్తామంటూ బీఆర్ఎస్కు జైకొట్టారు. అనంతరం నేతన్నలు, మహిళలు వెంట రాగా కేటీఆర్ వారితో కలిసి ముందుకు సాగారు. ఇంటి నుంచి ఒక్కొక్కరుగా బయటకు వచ్చి కేటీఆర్‌తో కరచాలనం చేసేందుకు ఉత్సాహం చూపారు. అందరి యోగక్షేమాలు అడుగుతూనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చేయకపోవడం వల్ల కలిగే ఇబ్బందులు, బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాన్ని వివరిస్తూ కేటీఆర్ ముందుకు కదలిరారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో నేతన్నల సంక్షేమానికి తీసుకున్న చర్యలు రెండేండ్లుగా కొనసాగుతున్న సంక్షోభం వంటి అంశాలను కండ్లకు కట్టినట్టు వివరించారు.
సిరిసిల్లలోని ఒకటో వార్డు జ్యోతినగర్‌ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. అనంతరం పట్టణంలోని బీవైనగర్ జెండా చౌరస్తా, సుందరయ్యనగర్, వెంకంపేట, హనుమాన్ టెం పుల్ చౌరస్తా, రాజీవ్‌నగర్ గాంధీచౌరస్తా, శాంతినగర్ చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి కార్యక్రమాలను కూడా పకనపెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలుగా మాటలు, అబద్ధాలు ఆడడం తప్ప ఈ రెండేండ్లలో ఒక మంచి పని కూడా లేదని విమర్శించారు. చేతిలో అధికారం, అవకాశం ఉన్నప్పుడు కేసీఆర్‌ను తిట్టాల్సిన అవసరం ఏమున్నదని ప్రశ్నించారు.
చేతనైతే ప్రజలకు మంచి చేయాలి లేదా ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఏర్పా టు చేసిన చిన్న జిల్లాలను తీసివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. జిల్లాలు ఎత్తివేస్తామని చెప్పిన తర్వా త కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది మంచిదా.. చెడ్డ దా..? అనే విషయం ఆలోచించి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికలు పదేండ్ల పాటు ప్రజలకు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి, రెండేండ్ల నుంచి సంక్షేమ పథకాలను ఎగ్గొట్టిన కాంగ్రెస్ పార్టీకి మధ్య పోటీ అని కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్లలో పద్మశాలీ సంఘానికి రూ.25 కోట్ల విలువైన ఐదెకరాల భూమి, రూ.8 కోట్లు మంజూరు చేశామని గుర్తుచేశారు.
పన్నెండేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడ ఎంపీగా ఉన్న బండి సంజయ్ సిరిసిల్లకు 10 పైసల పని కూడా చేయలేదని, సిగ్గులేకుండా ఓట్లు అడుగుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలను, 420 హామీలను అమలు చేయలేకపోవడాన్ని ప్రశ్నిస్తే బూతు మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న బీడీ కార్మికులు పింఛన్ ఇయ్యమని అడుగకముందే వారికి ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు.

రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు డబుల్ ఇస్తామని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తామని గద్దెనెక్కారని.. ఇప్పటికి 800 రోజులైనా పెంచిన పింఛన్లు, కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు, స్కూటీలు, మహిళలకు 2,500, కల్యాణలక్ష్మి తులం బంగారం ఇవ్వలేదని మండిపడ్డారు. ఆయాచోట్ల ప్రచారాల్లో బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి తుల ఉమ, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, 39వార్డుల అభ్యర్థులు పాల్గొన్నారు.
తనమీద కోపంతో రాజన్న సిరిసిల్ల జిల్లాను రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్‌కు.. అభివృద్ధి చేయలేక, దేవుడి పేర్లు చెప్పి ఓట్లడిగే బీజేపీకి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుతో తగిన బుద్ధిచెప్పాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. నేతన్నలకు బతుకునిచ్చిన కేసీఆర్‌ను మరోసారి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. అడ్డగోలు హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్‌ను నిలదీయాలని, లేకుంటే మరో మూడేండ్ల దాకా కాంగ్రెస్ తన మోసాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ఒక్కసారి మోసపోతే మోసం చేసినోనిది తప్పయితదని, రెండోసారి కూడా మోసపోతే ఓట్లేసిన మనది తప్పవుతుందని.. ఈ ఎన్నికల్లో బలికావద్దని సూచించారు. సిరిసిల్ల నేతన్నలను బతుకమ్మ చీరలు ఇచ్చి, చేతినిండా పని ఇచ్చి అత్మగౌరవంతో బతికేలా చేసిన కేసీఆర్ అశీర్వదించాలని, మీరు వేసే ఒక్కొక్క ఓటు కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేస్తుందని చెప్పారు. మళ్లీ వచ్చేది, రాబోయేది కేసీఆర్ సర్కారేనని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
పదేండ్లు అత్మగౌరవంతో బతికిన సిరిసిల్ల నేత కార్మికులకు బతుకమ్మ చీరలు బంద్ చేసిన్రు. సిరిసిల్ల కాంగ్రెస్ నేత కేకే మహేందర్‌రెడ్డి నిరోధ్‌లు అమ్ముకోర్రి, పాపుడాలు అమ్ముకోర్రి అని అవమానకరంగా మాట్లాడిండు. అవమానించినోళ్లకు బుద్ధి చెప్పండి.
– కేటీఆర్