హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కింద మంగళవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2,02,32,055 ఎన్యుమరేషన్ ఫామ్‌లను (59.81శాతం) బీఎల్వో (బూత్ లెవల్ ఆఫీసర్లు)లు ఇంటింటా పంపిణీ చేసినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. జూన్ 25 నుంచి ఎన్యుమరేషన్ ఫామ్‌ల పంపిణీ ప్రారంభమైందని, వాటిని నింపిన తర్వాత జూలై 24 వరకు బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి తీసుకొంటారని తెలిపారు. ఈ మేరకు బీఎల్వోలకు అవసరమైన కిట్లు, దరఖాస్తు (ఫామ్-6, 7, 8), డిక్లరేషన్ ఫారాలతోపాటు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని రెయిన్ కోట్లను కూడా అందజేసినట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎఫ్ఎమ్ రేడియో, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు 2కే రన్ వంటి అవగాహన కార్యక్రమాలను కూడా విస్తృతంగా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ‘సర్’ను పారదర్శకంగా నిర్వహించేందుకు సీఈవో స్థాయిలో ఇప్పటివరకు మూడుసార్లు, జిల్లా (డీఈవో), నియోజకవర్గ (ఈఆర్వో), ఏఈఆర్వో, బీఎల్వో స్థాయిల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు.
గ్రేటర్లో ఆంగ్లంలో దరఖాస్తులు
రాజకీయ పార్టీల విన్నపం మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఎన్యుమరేషన్ ఫామ్‌లను ఆంగ్లంలోనూ, మిగతా రాష్ట్రమంతటా తెలుగులోనూ ముద్రించినట్టు సీఈవో సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం ఉర్దూలో కూడా డమ్మీ ఫామ్లనూ అందుబాటులో ఉంచామని తెలిపారు. ఓటర్ల నమోదు, సవరణపై అవగాహన కల్పించేందుకు, ఎన్యుమరేటర్ల సందేహాలను నివృత్తి చేసేందుకు డీఈవో, ఈఆర్వో, ఏఈఆర్వో కార్యాలయాల్లో మొత్తం 1,035 హెల్ప్డెస్లను ఏర్పాటుచేశామని వివరించారు. 2026 అక్టోబర్ 1 అర్హత తేదీగా ‘సర్’ ప్రక్రియను ప్రారంభించినట్టు తెలిపారు. రాష్ట్రంలో 3.38 కోట్లకు పైగా ఓటర్లు ఉంటే వీరిలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని తెలిపారు. మొత్తం ఓటర్లు 3,38,26,448 మంది ఉండగా, ఇందులో పురుషులు 1,67,60,643 మంది, మహిళలు 1,70,62,946 మంది, థర్డ్ జెండర్ 2,859 మంది చొప్పున ఉన్నారని పేర్కొన్నారు.