హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇంటర్‌బోర్డు, ఇంటర్ విద్యా కమిషనరేట్‌ను ఎత్తివేసేందుకు రంగం సిద్ధమవుతున్నది. ఇంటర్‌బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేయనున్నారు. నర్సరీ నుంచి ఇంటర్ వరకు పాఠశాల విద్య ఆధ్వర్యంలో నడిచే విద్యావిధానాన్ని తీసుకురానున్నారు. ఈ దిశగా తెలంగాణ విద్యాకమిషన్ ఓ నివేదిక సిద్ధంచేసింది. వారంలో ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నది. రాష్ట్రంలో 1968 అక్టోబర్ 25న అప్పటి విద్యాశాఖ మంత్రి పీవీ నరసింహారావు నేతృత్వంలో ఇంటర్‌బోర్డుకు అడుగులు పడ్డాయి.
తొలి విద్యాసంవత్సరం(1969-70)లో 120 పాఠశాలలు, డిగ్రీ కళాశాలల్లో ఇంటర్‌విద్యను ప్రారంభించారు. ఏటా 9లక్షల మంది విద్యార్థుల పైచదువులకు గేట్‌వేలా మారింది. అయితే ఇంటర్‌బోర్డును, ఇంటర్ విద్యను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు, విద్యాకమిషన్ పావులు కదుపుతున్నాయి. రాష్ట్రంలో 430 సర్కారు జూనియర్ కాలేజీలున్నాయి. వీటిల్లో 1.60లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. విలీనంతో అనేక సమస్యలొస్తాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలని సర్కారుకు సిఫారసు చేయనున్నది. కేంద్రీయ విద్యాలయాల తరహాలో విలీనం చేయాలని, ఇలా చేస్తే డ్రాపౌట్స్‌ను తగ్గించవచ్చని కమిషన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో ఇంటర్ వరకు విద్యనందించాలని కమిషన్ సిఫారసు చేసింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేసే మండలంలో జూనియర్ కాలేజీ ఉంటే వాటిని టీపీఎస్‌కు అనుబంధంగా నడపాలని కమిషన్ సూచించింది. ఇదే అంశంపై కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా అభిప్రాయసేకరణ జరిపింది. ఆయా అంశాలతో కూడిన నివేదికను సర్కారుకు సమర్పించనున్నది.
ఇంటర్ బోర్డు విలీనం అంశంపై జూలైలో జరిగిన విద్యాశాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షలోనూ చర్చకు వచ్చింది. 1-8వ తరగతుల వరకు సెకండరీ, 9-12వ తరగతులకు సీనియర్ సెకండరీ స్కూల్స్‌ను ఒకేచోట పెడితే ఎలా ఉంటుంది..? అన్న అంశంపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇతర రాష్ర్టాల్లో అడ్మిషన్లు, డ్రాపౌట్స్, ఫలితాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ఇటీవలే కేంద్ర విద్యాశాఖ ఒకే రాష్ట్రంలో రెండు బోర్డులు అవసరమా..? అంటూ వ్యాఖ్యానించింది. పదోతరగతి, ఇంటర్‌కు రెండు బోర్డులెందుకు, ఒకే బోర్డును నిర్వహించాలని సూచించింది. అటూ కేంద్రం ప్రశ్నించడం, ఇటూ సీఎం అధ్యయనం చేయాలనడం, విద్యాకమిషన్ నివేదికను సిద్ధం చేయడం చకా చకా జరిగిపోయాయి.
ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న సర్కారు ఆలోచనను ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది విద్యావ్యవస్థను 50 ఏండ్లు వెనక్కి తీసుకెళ్లడమే అవుతుందని వాపోయారు. దీన్ని తిరోగమన చర్యగా అభివర్ణించారు. ఈ ఆలోచనను సర్కారు తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు.