హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తేతెలంగాణ): పాలమూరును పడావుపెట్టిన ద్రోహులను ప్రజల ముందు దోషులుగా నిలబెడుతాం.. పాలమూరు ప్రాజెక్టు కోసం మండుటెండల్లో పాదయాత్ర నిర్వహించి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగడుతాం.. అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కార్ ఇకనైనా మొద్దు నిద్ర వీడి పాలమూరు ప్రాజెక్టులపై దృష్టిపెట్టాలి.. వెంటనే పనులు ప్రారంభించి వచ్చే వానకాలంలోగా రిజర్వాయర్లను అందుబాటులోకి తేవాలి.. అని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణభవన్‌లో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఎలాంటి ఆటంకం లేకుండా నీరు సరఫరా చేయాలని కోరారు. అసంబద్ధమైన గొల్లపల్లి రిజర్వాయర్ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు అవలంబించిన విధానాలతో వెనుకడిన ప్రాంతానికి కేరాఫ్‌గా పాలమూరు మారిందని విమర్శించారు. రాష్ట్రం సిద్ధించే నాటికి సుమారు 14లక్షల మంది బతుకుదెరువు కోసం వలసపోయారని తెలిపారు. పాలమూరువాసుల బాధలు, కష్టాల కేం ద్ర బిందువుగానే తెలంగాణ ఉద్యమంలో పాటలు, సాహిత్యం, వ్యాసాలు వచ్చాయని గుర్తుచేశారు. ఏప్రిల్ 16, 2010న ఢిల్లీలో ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్, విద్యాసాగర్‌రావు సమక్షంలో ఇచ్చిన ప్రజెంటేషన్‌లో పాలమూరు కష్టాలు, కన్నీళ్లు, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టాలను వివరించామని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు వెనుకేయబడిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కేసీఆర్ పాలనలోనే పచ్చబడ్దదని స్పష్టంచేశారు. 2014లో 74 వేలు ఉన్న తలసరి ఆదాయం 2024-25 నాటికి 352.86శాతం పెరిగి రూ. 3,36,898కి చేరిందని చెప్పారు. ఇవీ తాము చెబుతున్న లెక్కలుకాదని, సోషియో ఎకానమిక్ సర్వే ద్వారా వెల్లడించిన వివరాలని అన్నారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత కేసీఆర్ పాలనలో వచ్చిన మార్పునకు ఈ ఆధారాలే నిదర్శనమని తెలిపారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక చైతన్యానికి ఈ గణంకాలు ప్రతిరూపాలని పేర్కొన్నారు. వాస్తవాలను విస్మరించి కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్‌గా మార్చిన ఘన త బీఆర్ఎస్కే దక్కిందని నిరంజన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. 70 మండలాలకు మంచినీళ్లు, 12.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన ఘనత ఒక్క కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు. ‘ఎన్నో ఇబ్బందులను దాటుకొని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతులు సాధించాం.. 2013 భూసేకరణ చట్టంలోని నిబంధనలను అధిగమించి పబ్లిక్ హియరింగ్‌లు పూర్తిచేశాం.. ఈ క్రమంలోనే ఐదు రిజర్వాయర్లు కట్టినం..నాలుగు పంపింగ్ స్టేషన్లు పూర్తిచేసినం. మోటర్లు బిగించి ట్రయల్న్ నిర్వహించినం..’అని స్పష్టంచేశారు. మిగిలిన 10శాతం పనులు పూర్తి చేసుకుంటే కరివెన వరకు 50 టీఎంసీల నీళ్లు నింపుకొనే అవకాశం ఉన్నదని తెలిపారు. కానీ కాంగ్రెస్ సర్కార్ తిరోగమన విధానాల మూలంగా తిరిగి వలసలుపోయే దుస్థితి మళ్లీ వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. గద్దెనెక్కి మూండేండ్లు కావస్తున్నా.. ఆ జిల్లా వాసే సీఎంగా ఉన్నా కనీసం పాలమూరు ప్రాజెక్టులపై ఎందుకు సమీక్షించడం లేదని నిలదీశారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని 2014 పాలమూరు గడ్డపై ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీకి 8మంది చొప్పున ఎంపీలున్నా తెలంగాణకు ఒరిగిందేమీ లేదని ఆయన విమర్శించారు.
ఏపీ సర్కార్ పాలమూరు-రంగారెడ్డిపై అనేక అభాండాలు వేస్తున్నదని ధ్వజమెత్తారు. ‘ఈ ప్రాజెక్టు పునర్విభజన చట్టానికి వ్యతిరేమని ఏపీ సీఎం మొండి వాదన చేస్తున్నరు.. లేఖలు రాస్తున్నరు..కోర్టులు, ట్రిబ్యునల్‌లో కేసులు వేస్తున్నరు..’అని మండిపడ్డారు. ఏపీ సీఎం వైఖరిపై సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు నోరుమెదపడం లేదు? అని ప్రశ్నించారు. కృష్ణా బేసిన్‌తో సంబంధం లేకుండా సగటున రోజుకు 13 టీఎంసీల నీళ్లు తరలించేందుకు పనులు పూర్తిచేసుకున్నారు.. పెండింగ్ పనులు పూర్తయితే 16 టీఎంసీలకు చేరుకొనే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సర్కారే దీని సర్వేకు అనుమతులిచ్చిందని ఆరోపించారు. రేవంత్ నిర్లక్ష్యానికి భావి తరాలు మూల్యం చెల్లించే పరిస్థితి ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
అంతర్రాష్ట్ర వివాదాల్లేకుండా వట్టెంవద్ద తూము ఏర్పాటు చేసి కేఎల్ఐ కింద 1.50లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తుచేశారు. కేఎల్ఐ కాలువల కెపాసిటీ తగ్గించిన క్రమంలో నాలుగు మోటర్లు నడిస్తే కాలువలు సరిపోవనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేశామని తెలిపారు. కల్వకుర్తి, జడ్చర్ల వద్ద రిజర్వాయర్ ప్రతిపాదిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కేఎల్ఐ కింద నాలుగు టీఎంసీల్లోపే రిజర్వాయర్లు ఉన్నందున కొత్తవాటి నిర్మాణానికి సర్వే చేయించామని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి చేపట్టిన తర్వాత కేసీఆర్ కేఎల్ఐని అనుసంధానించారని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిందేనంటూ ఏదుల రిజర్వా యర్కు ఆనుకొని గొల్లపల్లి రిజర్వాయర్‌ను 6 టీఎంసీలతో నిర్మిస్తామని రూ.1,800 కోట్లతో ప్రతిపాదనలు తీసుకురావడం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు. దీనిని వ్యతిరేకిస్తూ 100 రోజులు దీక్షలు చేసిన ప్రజలకు మద్దతుగా.. హరీశ్‌రావు బహిరంగసభ నిర్వహించారని గుర్తుచేశారు. 10వేల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టును రద్దు చేయించి గొల్లపల్లిని తెరపైకి తేవడం ఎందుకని నిలదీశారు. కేసీఆర్ పాలనలో జూరాల, భీమా, కేఎల్ఐ నుంచి సాగునీరందిందని, దీంట్లో మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఎలాంటి పాత్రలేదని స్పష్టంచేశారు. ప్రస్తుతం నార్లాపూర్-ఏదుల లింక్‌లో కొద్ది మాత్రమే పనులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే ఆరు నెలల్లో పూ ర్తిచేస్తే.. 50 టీఎంసీలు నీరు నిలుపుకొనే అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఇందుకు కేవలం రూ.1200 కోట్లు మాత్రమే అవసరమవుతాయని పేర్కొన్నారు.
కేసీఆర్ తలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో కొడంగల్ ప్రాంతానికీ నీరందే అవకాశమున్నదని నిరంజన్‌రెడ్డి చెప్పారు. కానీ పెండింగ్ పనులు పూర్తిచేసేందుకు ప్రభుత్వానికి ఎందుకు ఆసక్తి లేదో అర్థంకావడం లేదని అన్నారు. దీనిని పక్కనబెట్టి జూరాల ఆధారంగా నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తేవడం దుర్మార్గమని ఆయన ధ్వజమెత్తారు. ఇది విఫల ప్రాజెక్టుగా మిగిలిపోనున్నదని హెచ్చరించారు. డిండికి సాగునీరందించాలని గతంలో పాలమూరు బీఆర్ఎస్ నేతలమందరం ప్రతిపాదించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదుల నుంచి డిండి ఎత్తిపోతలకు నీరందించాలని నిర్ణయించి టెండర్లు పూర్తిచేసిందని చెప్పారు. డిండి టన్నెల్ తవ్వకాల్లో ఎక్కడ కేఎల్ఐ టన్నెల్ తగిలినా వ్యవస్థ మొత్తం కూలిపోయే ప్రమాదమున్నదని హెచ్చరించారు. అందుకే వట్టెం వద్ద తూము ఏర్పాటు చేసి దుందుభి వాగులోకి వదలడం ద్వారా డిండికి నీరందించాలని ప్రతిపాదించగా, ప్రస్తుత మంత్రి జూపల్లి, అప్పటి ఎంపీ జితేందర్‌రెడ్డి సంతకాలు చేశారని నిరంజన్‌రెడ్డి తెలిపారు. కానీ ఇప్పుడు మంత్రి జూపల్లి మాత్రం నోరుమెదపకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు పాలమూరు జిల్లా శాశ్వత ప్రయోజనాల కోసం పనిచేయాలని ఆయన హితవుపలికారు.