హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో రైతాంగానికి అనేక కష్టాలొచ్చాయని, యూరియా కోసం అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ అసలు రైతులకు శిక్ష విధిస్తున్నదని, కౌలురైతులపై కక్ష కట్టిందని మంగళవారం ప్రకటనలో దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో యూరియాకు ఎందుకింత కొరత ఉన్నదని ప్రశ్నించారు. టెనెన్సీ యాక్టు అసలు రైతులు, కౌలురైతుల మధ్య చిచ్చు పెట్టే విధంగా, సాగును తగ్గించే కుట్ర లా ఉన్నదని ఆరోపించారు. యూరి యా పంపిణీ కోసం యాప్ విధానం అమల్లోకి తేవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. యాప్ ద్వారా ఇంటినుంచే యూరియా బుకింగ్ చేసుకోవాలనే నిర్ణయం కూడా అనుమానాస్పదంగా ఉన్నదని పేర్కొన్నారు. దళారులు రైతుల పేర్ల మీద యూరియా బుక్ చేసుకునే అవకాశం ఉన్నదని ఆరోపించారు.
నిరక్షరాస్యులైన రైతులు, స్మార్ట్‌ఫోన్ వా డటం రాని వాళ్లు ఇబ్బందులు పడుతారని మండిపడ్డారు. ఏజెన్సీ ప్రాంతాల్లో, నెట్‌వర్క్‌లేని ఏరియాల్లో సమస్యను ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. మొదట కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయకుండా, మొత్తం రాష్ట్రంలో అమలుచేయాలని అనుకోవడం అనాలోచితమై న చర్య అని విమర్శించారు. యూరి యా ధర కన్నా, రవాణా చార్జీలు అధిక భారం పడేలా ప్రభుత్వ చర్యలున్నాయని మండిపడ్డారు. యూరియా కోసం ఆధార్, పట్టాదార్ పాసుబుక్, ఓటీపీ, ఇదంతా ఒక ప్రహసనంగా ఉన్నదని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ రైతుభరోసా నాలుగుసార్లు ఎగ్గొంటిందని, రూ.500 బోనస్ జాడ లేకుండా పోయిందని మండిపడ్డారు.