వనపర్తి, మే 19 (నమస్తే తెలంగాణ): సభ్యత్వ నమోదుతో బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంలోనూ పటిష్టంగా ఉండాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై సన్నాహక సమావేశం జరిగింది. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు మెట్టు శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. వనపర్తి నియోజకవర్గంలో గతంలో 70వేలకుపైగా సభ్యత్వ నమోదుచేసి ముందంజలో నిలిచినట్టు గుర్తుచేశారు.
ఈ సారి సైతం సభ్యత్వ నమోదును పకడ్బందీగా చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రేవంత్ పాలన సర్కస్‌ను తలపిస్తుందని ఎద్దేవాచేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్పై నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్ సూచించారు. జూన్ 25 నుంచి జూలై 25 వరకు సర్ కార్యక్రమం కొనసాగుతుందని, బూత్ కమిటీ సభ్యులు అర్హత ఉన్న ఓట్లను తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి అన్న లక్ష్యంతో కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు.