వనపర్తి, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించిన నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఎలాంటి సాగునీటి కేటాయింపులు లేవని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో ఈ ప్రాంతాలకు సాగునీరు అందించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించడంతో.. ఎక్కడ కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందోనన్న దురుద్దేశంతోనే రేవంత్‌రెడ్డి ప్రత్యేక ఎత్తిపోతలను ప్రతిపాదించారని ఆరోపించారు. సోమవారం వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో మక్తల్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రెండు నియోజకవర్గాలైన నారాయణపేట-కొడంగల్ ప్రాంతాలకు పాలమూరు ప్రాజెక్టు ద్వారా పుష్కలంగా సాగు నీరందించాలని టెండర్ ప్రక్రియ పూర్తిచేసిన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రయత్నాలను రద్దు చేసిందని విమర్శించారు.
జూరాల బ్యాక్ వాటర్ ఆధారంగా కొడంగల్‌కు ఎత్తిపోతల అంటూ మళ్లీ కొత్త నాటకం మొదలు పెట్టారని ధ్వజమెత్తారు. ఎలాంటి నీటి కేటాయింపులు లేకుండా ప్రారంభించే ఈ ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. కొడంగల్-నారాయణపేటకు సంపూర్ణంగా సాగునీరివ్వాలన్న తలంపు బీఆర్ఎస్కు ఉన్నదని, నీటి కేటాయింపులు లేకుండా కాంగ్రెస్ చెప్తున్న ఎత్తిపోతల ఎలా నడుస్తుందని నిలదీశారు. గతంలో ప్రతిపాదన ఉన్న భీమా ప్రాజెక్టు రద్దు అయినందున నికర జలాల్లో 20 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా ఏర్పాటు చేసుకోవాలన్న లక్ష్యంతోనే భీమా-1, భీమా-2 ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మక్తల్, దేవరకద్ర, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల ప్రాంతాలకు చెందిన భూములకు 20 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగిపోయినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుల కింద ఆయకట్టు 2 లక్షల ఎకరాలకు సరిపడా సాగు భూమి వినియోగంలోకి వచ్చిందని, ఈ పరిస్థితిలో కొడంగల్, నారాయణపేటలకు భీమా పరిధిలో సాగునీటిని ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ‘మీ ప్రతిపాదన ఎలా ఆమోదయోగ్యమో.. సాంకేతిక నిఫుణులతో జూరాల దగ్గరకు రావాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు. సాంకేతికతతోపాటు చట్టపరంగానూ ఇది వ్యతిరేకమని చెప్పారు.
పాలమూరు-రంగారెడ్డిని పూర్తి చేయాలి
కేవలం పది శాతం మిగిలిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధికంగా కృష్ణానది నీటిపారుదల ఉన్నదని, దాదాపు 308 కిలోమీటర్లు పొడవునా కృష్ణమ్మ పారుదల ఉన్నదని అన్నారు. పాలమూరు జిల్లా భూములకు సాగునీరందించేలా ఎగువ నుంచి దిగువ వరకు కట్టాల్సిన ప్రాజెక్టులను కట్టకుండా ఉమ్మడి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందునే సాగునీటి సమస్య ఉత్పన్నమవుతున్నదని అన్నారు. అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర, లెఫ్ట్ కెనాల్ ఉమ్మడి రాష్ట్రంలోనే నష్టపోయామని, 174 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులను ఉమ్మడి పాలమూరు కోల్పోయిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలోనే ఉమ్మడి జిల్లా అవసరాలకు 90 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా 12 లక్షల ఎకరాలకు సాగునీరిందించే విధంగా 27 వేల ఎకరాలను నాటి సీఎం కేసీఆర్ భూసేకరణ చేపట్టినట్టు తెలిపారు. ఇందులో కేవలం 65 ఎకరాల భూసేకరణ మాత్రమే మిగిలిందని చెప్పారు.
ఈ ప్రాజెక్టులో ఉమ్మడి పాలమూరుతోపాటు నల్లగొండలోని మునుగోడు, దేవరకొండ, రంగారెడ్డి జిల్లాలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతంలోని భూములకు సాగునీరు, 1,200 గ్రామాలకు తాగునీరందించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టి 90 శాతం పనులు పూర్తి చేసిందని పేర్కొన్నారు. ఇంకా ఇప్పటికీ ఏ మాత్రం బుద్ధిలేకుండా జూరాలపై పాలమూరు-రంగారెడ్డిని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సొంత జిల్లా బిడ్డను అంటూ చెప్పిన రేవంత్‌రెడ్డి రెండేండ్లలో పాలమూరు ప్రాజెక్టు ఊసెత్తకుండా జిల్లా రైతాంగానికి తీరని ద్రోహం చేశారని దుయ్యబట్టారు. సాగునీటి రంగంపై ఏ మాత్రం అవగాహన, అధ్యయనం లేని పాలకులు కేసీఆర్ మరణ శాసనమంటూ తప్పుడు మాటలు మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఏడాది అనంతరం జరిగిన కృష్ణా రివర్ బోర్డు (కేఆర్‌బీ) సమావేశంలో ఇరు రాష్ర్టాల సాగునీటి ప్రిన్సిపల్ సెక్రటరీలతోపాటు కేంద్ర ప్రభుత్వ ముఖ్యులు సంతకాలు చేసిన మినిట్స్‌ను నిరంజన్‌రెడ్డి మీడియాకు చూపించారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో.. ఇప్పుటి తెలంగాణ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ నాడు సంతకం పెట్టారని, ఇప్పుడు ఆయన ద్వారా ఉన్న సాగునీటి కేటాయింపులపై మీడియాకు వివరాలు చెప్పించాలని డిమాండ్ చేశారు. అప్పట్లో నిర్ణయం జరిగిన మినిట్స్‌లో ముఖ్యమంత్రుల సంతకాలు లేవని, బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే నిర్ణయం జరిగిందని తెలిపారు.
ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై అవగాహన లేదు..
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రులకు అవగాహన లేదని మక్తల్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు. పాలమూరు గడ్డపై పుట్టిన బిడ్డనైన తనను సీఎం చేసిన ప్రజల రుణం తీర్చుకుంటానని రేవంత్ చెప్పినా.. ఆచరణలో మాత్రం ప్రభావం చూపడం లేదని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రెండు పంటలకు సాగునీరు పారిస్తానని, ప్రగల్భాలు పలికిన రేవంత్‌రెడ్డితోపాటు జిల్లాలోని ఇద్దరు మంత్రులకు సాగునీటి ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదని విమర్శించారు.
కేసీఆర్ గెలువకపాయె.. పాలమూరు ఆగిపాయె..
కేసీఆర్ మళ్ల గెలువకపాయె.. పాలమూరు ప్రాజెక్టు అగిపోయె.. ఆయనే వచ్చి ఉంటే ప్రాజెక్ట్ పూర్తయుతుండే.. రేవంత్‌రెడ్డి వచ్చి రెండేైండ్లెనా పూర్తి చేయకనేపాయె.. ఎక్కడ పని అక్కడే ఆపే.. పాలమూరు పూర్తయ్యుంటే మాకు కాల్వల పొంటి నీళ్లొస్తుండె.. చెరువులు నింపుతుండె.. బోర్లల్ల నీళ్లు బాగా పడుతుండె. వ్యవసాయం బాగా అయితుండే. వ్యవసాయం చేద్దామంటే యూరియా కూడా ఇస్తలేరు. ఎకరాకు రెండు సంచులే ఇస్తే ఎట్లా చేయాలి. మా పొలాలన్నీ మందులకు అలవాటు పడ్డాయి. ఎకరాకు కనీసం 4 సంచులైతే తప్ప పంట పండదు. కేసీఆర్ ఉన్నప్పడు యూరియా కావాలని ఫోన్ చేస్తే ఆటోలో వచ్చి ఏసి పోతుండ్రి. మా జిల్లా సీఎం అంటూ చెప్పుకుంటున్నాడు. మా జిల్లాకు చేసిందేమీ లేదు. ఈసారి వస్తే గిస్తే కేసీఆర్ సారే వస్తడు. ఆయప్పకే ఓటేస్తాం. – రాంరెడ్డి, వేముల, మూసాపేట మండలం, మహబూబ్‌నగర్‌జిల్లా
కాంగ్రెస్ పాలనలో పాలమూరుకు తీరని అన్యాయం
కాంగ్రెస్ పాలనలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు తీరని అన్యాయం. కాంగ్రెస్ వచ్చినంకే ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగడమే లేదు. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలను సస్యశామలం చేసేందుకు, కేసీఆర్ నాడు రూ.35 వేల కోట్లతో ఈ పథకాన్ని చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పనులు పూర్తికాగా, మిగిలిన 10 శాతం పనులు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించడమే లేదు. ఈ ప్రాజెక్ట్ పనులు నిలిచిపోవడంతో ఈ ప్రాంత రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. కేంద్రంతోపాటు పక్క రాష్ట్రంతో ఉన్న బంధంతో ఈ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం ఎగనామం పెట్టినట్టుంది. న్యాయపరంగా తెలంగాణకు రావాల్సిన జలాలను సాధించుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. కృష్ణ, గోదావరి జలాల కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగేతే ఊరుకోనేది లేదు.
–లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కడ్తాల్ మండలం