Niranjan Reddy | హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతులు లక్షల సంఖ్యలో ఉన్నారని, వారికి అండగా నిలిచేందుకు తెలంగాణభవన్‌లో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఈ ప్రత్యేక సెల్లో ఇద్దరు నిపుణులు అందుబాటులో ఉంటారని చెప్పారు. 83748 52619 నంబర్‌కు రైతులు తమ సమగ్ర వివరాలను పంపించాలని సూచించారు. రుణం తీసుకున్న తేదీ, రుణం తీసుకున్న మొత్తం, పట్టదారు పాసు పుస్తకం, బ్యాంకు, జిల్లా, మండలం, గ్రామం తదితర వివరాలను పంపించాలని సూచించారు. వీటన్నింటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రుణమాఫీ అయ్యేవిధంగా ఒత్తిడి తెస్తామని చెప్పారు. సోమవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతాంగానికి కాంగ్రెస్‌పై భ్రమలు తొలిగిపోయాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రైతుల సంఖ్యను ప్రభుత్వం తగ్గించి చూపుతున్నదని మండిపడ్డారు. పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను మొత్తం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అరకొరగా రుణమాఫీ చేసి అంతా అయిపోయిందని భ్రమింపచేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 60 లక్షల మంది పంట రుణాలు తీసుకుంటే కేవలం 16 లక్షల మందికి రూ.12 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తొలి విడతలో 39 లక్షల మంది రైతులకు రూ.లక్ష వరకు రుణాలను మాఫీ చేశామని, రెండో విడతలో రూ.19 వేల కోట్లకుగాను రూ.13 వేల కోట్ల రుణం మాఫీ చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు విడతల రుణమాఫీలో చూపిస్తున్న రైతుల సంఖ్య 17 లక్షల మాత్రమేనని, రైతుల సంఖ్య తగ్గిపోవడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
రైతుల వివరాలపై గోప్యత ఎందుకు?
ప్రభుత్వం రైతుల వివరాలను వెల్లడించకుండా గోప్యంగా ఉంచడంలో మతలబు ఏమిటని నిరంజన్‌రెడ్డి నిలదీశారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు కింద ఒక విడతలో ఇచ్చిన మొత్తమే రూ.7,500 కోట్లు ఉన్నదని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల ప్రకారం రైతుభరోసా కింద రైతులు, రైతు కూలీలు, వ్యవసాయ కూలీలకు రూ.30 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. రైతుబంధు, రైతుభరోసా ఎగ్గొట్టి రుణమాఫీ అంటూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకొక విడత రుణమాఫీకి రూ.100 కోట్లు, రూ.200 కోట్లతో పత్రికా ప్రకటనలు విడుదల చేశారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ప్రకటనలు ఇస్తామంటే ప్రభుత్వం తరపున వద్దు అనవసర వ్యయం అంటూ కేసీఆర్ వారించేవారని చెప్పారు. రైతుభరోసాపై క్యాబినెట్లో ఎందుకు చర్చించలేదు? శాసనసభలో ఎందుకు ప్రకటించలేదు? అని నిలదీశారు.
రుణమాఫీపై చర్చకు సిద్ధమా?
గ్రామాల్లో రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ పడిగాపులు గాస్తున్నారని, చిన్న,చిన్న కారణాలతో రుణమాఫీ చేయడం లేదని నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పట్టాదారు పాస్‌పుస్తకం ఉంటే రుణమాఫీ అని సీఎం చెప్తున్నారని, పట్టాదారు పాస్‌పుస్తకం ఉండి రుణమాఫీ కానీ వాళ్లపై చర్చకు ప్రభు త్వం సిద్ధమా? అని సవాలు చేశారు. ఉమ్మడి రాష్ట్రం లో రైతులు పడ్డ కష్టాల నుంచి బయటపడేసేందుకు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ రుణమాఫీ చేశారని, కానీ కాంగ్రెస్ అత్యంత తకువ సమయంలో తనను నమ్మిన రైతాంగాన్ని మోసం చేసిందని చెప్పారు.
632 మందిలో 14మందికి మాఫీ: వివేకానంద
రైతు రుణమాఫీ, రైతు భరోసాపై శాసనసభలో చర్చ జరపకుండా కాంగ్రెస్ పార్టీ పారిపోయిందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఎద్దేవా చేశారు. ఈ విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం, వ్యవసాయ మంత్రి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. తన నియోజకవర్గంలోని భౌరంపేట పీఏసీఎస్‌లో 632 మంది రైతులు రుణాలు తీసుకుంటే మొదట విడతలో 11 మందికి, రెండో విడతలో ముగ్గురికి మాత్రమే రుణమాఫీ జరిగిందని తెలిపారు. రైతుభరోసా, రుణమాఫీపై ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వబోమని హెచ్చరించారు.
అందరికీ రుణమాఫీ చేయాలి
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ నగరంలో ఉన్న వివిధ బ్యాంకుల్లో తెలంగాణ రైతులు తీసుకున్న రుణాలను సైతం మాఫీ చేయాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రైతులతోపాటు బీఆర్ఎస్ నాయకులు ర్యాలీ చేపట్టి కలెక్టర్ సంతోష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా నేత హన్మంత్నాయుడు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో ఆయా బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న అందరికీ రు ణమాఫీ జరిగిందని, ప్రస్తుతం కూడా అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
5 గంటల్లోనే 15 వేల ఫిర్యాదులు
రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ ఏర్పాటుచేసిన ప్రత్యేక సెల్‌కు అనూహ్య స్పందన లభించింది. వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చిన ఐదు గంటల్లోనే 15 వేల ఫిర్యాదులు రావడం గమనార్హం. రూ.లక్షన్నరలోపు రుణాలు మాఫీ కాని రైతులు 83748 52619 వాట్సాప్ నంబర్‌కు పంపించాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం సూచించగా, సాయంత్రం కల్లా రైతుల నుంచి ఫిర్యాదులు పోటెత్తాయి. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. తమకు ఎందుకు రుణమాఫీ కాలేదో వ్యవసాయ, బ్యాంకు అధికారులు సమాధానాలు చెప్పడంలేదని మెసేజ్‌లో తెలిపారు. పేర్లలో చిన్నచిన్న పొరపాట్లు ఉన్నాయంటూ రుణమాఫీ చేయడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. రుణమాఫీ కటాఫ్ తేదీని 2024 మార్చి 31కి మార్చాలని కొందరు రైతులు కోరారు. మరికొందరు బంగారం కుదవ పెట్టి పంట రుణం తీసుకున్న రుణాల సంగతిపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. ఒకే ఆధార్ నంబర్‌ను ఇద్దరికి లింక్ చేయడంతో ఆ రైతు రుణమాఫీ పొందలేకపోయాడనే ఫిర్యాదులు కూడా వచ్చాయి. తనకు రూ.75 వేలు మాఫీ చేశారని, కానీ, మరో రూ.10 వేలు కడితేనే రుణమాఫీ చేస్తామంటున్నారని ఒక రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ వాట్సాప్‌కు వచ్చిన కొన్ని మెసేజ్‌లు
వనపర్తి జిల్లా పానగల్ మండలం చిక్కెపల్లి గ్రామానికి చెందిన గంగస్వామి డీసీసీబీ బ్యాంకు ద్వారా రూ. 1.20 లక్షల రుణం రుణం తీసుకున్నాడు. ఇప్పటివరకు రుణమాఫీ కాలేదు. ఆ ఇంట్లోని కుటుంబసభ్యులు ఎవ్వరికీ మాఫీ కాలేదు.