హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు ఉన్మాద భాష మాట్లాడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వాడే భాష, దూషణలను హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారించాలని కోరారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నందుకు ప్రజలు రాజకీయంగా మీకు ఓట్లతో దెబ్బలు కొడతారని హెచ్చరించారు. కొరడా దెబ్బలు కొట్టడానికి ఇది రాచరిక ప్రభుత్వమా? రేవంత్‌రెడ్డి ఏమైనా రాజా? అని ప్రశ్నించారు. ప్రెస్‌క్లబ్‌లు ప్రజాస్వామ్య వేదికలని, అక్కడినుంచే వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి క్లబ్బులు, పబ్బులు అని నీచభాష మాట్లాడటం తగదని హితవుపలికారు. భేషరతుగా జర్నలిస్టులకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి మాట్లాడేదంతా తెలంగాణ వ్యతిరేక శక్తుల ఆనందం కోసం, వారిని సంతృప్తి పరచడం కోసమేనని సగటు తెలంగాణ ప్రజలకు అర్థం అవుతున్నదని చెప్పారు. తెలంగాణభవన్‌లో గురువారం రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆంజనేయగౌడ్, బీఆర్ఎస్ నేతలు విద్యాసాగర్, కురువ విజయ్‌తో కలిసి నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. అది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదని, అంకెలు, రంకెలు, నిందారోపణలు, దూషణల సమావేశమని దుయ్యబట్టారు.
కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులపై ఎల్బీ స్టేడియమా? లేదా శాసనసభా? ఎక్కడ చర్చ చేద్దామో చెప్పండని నిరంజన్‌రెడ్డి సవాల్ విసిరారు. అంతకంటే ముందు ఆయా ప్రాజెక్టులను మీడియా, రైతులతో కలిసి సందర్శించి వద్దామని సూచించారు. నీళ్లు వాడే ఉపాయం లేక కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం తెలంగాణను అపాయంలోకి నెడుతున్నదని మండిపడ్డారు. ‘మాక్ అసెంబ్లీ పేరుతో వెటకారం మాటలు మాట్లాడతారా? మీకు చిత్తశుద్ధి ఉంటే ఎల్బీ స్టేడియంలో చర్చ పెట్టండి.. అసెంబ్లీలో పెట్టండి.. మా నాయకులు వస్తారు. మీకు చేతనైతే మీరు ఎంతసేపు మాట్లాడతారో మా నాయకులను అంత సేపు మాట్లాడనివ్వండి. దమ్ముంటే మైక్‌కట్ చేయకుండా ఉండండి. మీ వాదన నిజమైతే ప్రజలే చెప్తారు. దానికి కేసీఆర్ ఎందుకు? రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు కట్టుబడే చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ సహకరిస్తుంది’ అని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఎవరైనా చర్చకు రావాలని సవాల్ విసిరింది రేవంత్‌రెడ్డేనని, ప్రెస్‌క్లబ్‌లో కేటీఆర్ చర్చకు వచ్చిన తర్వాత ‘నేను సవాల్ విసరలేదు.. సూచన చేశాను’ అంటూ సీఎం మాట మార్చారని మండిపడ్డారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90% పూర్తయినా మిగిలిన 10% పనులను ఉద్దేశపూర్వకంగా పకన పెడుతున్నారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టును ఆరు టీఎంసీల నీటి లభ్యత ఉన్న జూరాల కింద నిర్మించాల్సిందని ఉత్తమ్‌కుమార్ మాట్లాడటం బాధ్యతారాహిత్యమని దుయ్యబట్టారు. జూరాల పరిధిలో ఉన్న ప్రాజెక్టులకే సరిపడా నీళ్లు అకడ అందుబాటులో లేవని, దానిని గమనించే కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో పెట్టారని గుర్తుచేశారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోకుండా రేవంత్‌రెడ్డి సర్కారు ఏపీకి సహరిస్తున్నదని విమర్శించారు. బనకచర్ల విషయంలో మొద్దునిద్ర పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తట్టిలేపింది హరీశ్‌రావేనని చెప్పారు. దీంతో ప్రభుత్వం మొకుబడిగా కేంద్రానికి లేఖలు రాసిందని, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి అపాయింట్మెంట్ ఇచ్చినా సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు కలవకుండా వెనకి వచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు ఆదేశాల మేరకే అపాయింట్మెంట్ను రద్దు చేసుకున్నారని విమర్శించారు.
ఇంజినీరింగ్ అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును తూలనాడటం మానసిక రుగ్మతేనని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రోజుకొక కుహనా మేధావితో పత్రికల్లో కాళేశ్వరం పనికిరానిది అంటూ వ్యాసాలు రాయిస్తున్నారని మండిపడ్డారు. కుంగిన రెండు పిల్లర్లను పునరుద్ధరించకుండా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి బనకచర్ల ప్రాజెక్ట్‌ను అడ్డుకోకుండా చంద్రబాబుకు సహకరిస్తూ కేసీఆర్ రావాలంటూ సంసారహీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.