వనపర్తి, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : శాసనసభలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను కించపరుస్తూ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన భాష ఆయన పదవికే కళంకమని, ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన వనపర్తి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
‘నీకంటే ముందు నుంచి రాజకీయాల్లో ఉండి.. మంత్రులుగా పనిచేసిన మహిళలపై అడ్డగోలుగా మాట్లాడటం తగదు’ అని అన్నారు. తొలిరోజు నుంచే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇలా మాట్లాడలేదని, నిజాలు మాట్లాడితే తట్టుకోలేక, అహంకారంతో వ్యవహరించడం సరైంది కాదని పేర్కొన్నారు.