నిజామాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఆదిలాబాద్: రాష్ట్రంలోని అన్నదాతల విశ్వాసం, నమ్మకాన్ని కాంగ్రెస్ సర్కారు కోల్పోయిందని, అనాథలం అనే భావన రైతుల్లో వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. పదమూడు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సర్కారు పాలనలో దాదాపు 409 మంది తనువులు చాలించాలని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలా రోజుకొకరు చొప్పున రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. రైతుల మరణాలను బహుమానాలుగా కాంగ్రెస్ సర్కారు అందిస్తున్నదని మండిపడ్డారు.
రైతులను ఆత్మహత్యల వైపు పురిగొల్పేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని ధ్వజమెత్తారు. రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సభ్యులు పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్, జోగు రామన్న, కోటిరెడ్డి, యాదవ్రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, రసమయి బాలకిషన్, అంజయ్యయాదవ్ శనివారం నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మెండారో మండలం బుస్సాపూర్‌లో పర్యటించారు. అక్కడి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అంతకు ముందు స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కమిటీ ముందు 11 మంది అన్నదాతలు కాంగ్రెస్ ఏడాది పాలనలో గోచరించిన అనుభవాలను వెళ్లబోసుకున్నారు.
బోధన్ నియోజకవర్గం నవీపేట మండలం నాగేపూర్ (మట్టయ్య ఫారం)కు చెందిన గిరిజన రైతు కేతావత్ పీర్చంద్ గత నెలలో ఆత్మహత్య చేసుకోగా, బాధిత రైతు కుటుంబానికి బీఆర్ఎస్ తరఫున రూ.లక్ష సాయాన్ని కమిటీ బృందం అందజేసింది. అనంతరం రైతులనుద్దేశించి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వ నీతిని ఎండగట్టారు. బాధిత రైతు కుటుంబాలను ఆదుకునేందుకు బీఆర్ఎస్ తరఫున అధ్యయన బృందం పర్యటిస్తుందని తెలిపారు. రైతులకు ఈ దుస్థితి రాకుండా ఉండేందుకు వ్యవసాయ రంగం లో ఎలాంటి విధానాలు అమలు చేయాలో, ఏ విధమైన చర్యలు ఉండాలో అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. రైతుల అనుభవాలు, సలహాలు, సూచనలతో నివేదికను త్వరలోనే రైతు కమిషన్‌కు అందిస్తామని నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఈ నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకూ అందిస్తామని చెప్పారు.
‘ఆదిలాబాద్ నుంచి బయలుదేరి నిజామాబాద్ సరిహద్దులోకి వచ్చినమో లేదో బజార్హత్నూర్లో మరో రైతు నర్సయ్య చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఇది చాలా దురదృష్టకరం. రైతులు మనోనిబ్బరం కోల్పోకుండా ఉండేందుకు తాము ఈ పర్యటనలు చేస్తున్నాము. మేమున్నామని రైతుల పక్షాన నిలబడుతున్నాము. కానీ ఈ ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వలేకపోతున్నది. అందుకే బలహీనమైన క్షణాల్లో తనువు చాలిస్తున్నారు’ అని నిరంజన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
వండిన అన్నం గంట లేటైనా తింటామన్న నమ్మకం ఉంటుందని, ఈ ప్రభుత్వం అనేకం ఇస్తామని రైతులకు చెప్పి, ఏదో చేస్తామని నమ్మబలికి, ఇప్పుడు ఏదీ చేయలేక పోతుందని విమర్శించారు. కేసీఆర్ పాలనలో రైతుబంధు, ఉచిత కరెంట్, సాగు నీళ్లు, రైతుబీమా ఇలా అనేక పథకాలు ఉన్నప్పటికీ పరోక్షంగా రైతుకు జరిగిన పెద్ద మేలు పంటల కొనుగోళ్లు అని వివరించారు. ఇప్పుడు ఏడాదికాలంగా పరిస్థితి అధ్వానంగా తయారైందని, బోనస్ అని చెప్పి కొంతమంది రైతులకే అందించారు. సన్న వడ్లు అని చెప్పి నూటికి ఐదుగురికే ఇచ్చారని ధ్వజమెత్తారు. ఇలాంటి స్థితిలో రైతుకు ధీమా లేకుండా పోయిందని చెప్పారు. రెట్టింపు కౌలుకు పంటలు సాగు చేసి మోసపోవద్దని, సాత్నాల మండలంలోని రైతు ఈశ్వర్లా అందరూ కావద్దని సూచించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటేనని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రైతుల ఆదాయాం రెండింతలు చేస్తానని 11 ఏండ్లయినా చేయని ప్రధాని మోదీని కాంగ్రెస్ అడగదని, 60 ఏండ్లయినా సన్న, చిన్నకారు రైతులకు పెన్షన్ ఇస్తామని ఇవ్వని కాంగ్రెస్‌ను బీజేపీ అడగదని నిలదీశారు. ‘అడగటానికి కేవలం కేసీఆర్ ఒక్కరే అగ్గువ దొరికిండు. కేసీఆర్ రెస్ట్ తీసుకుంటే కూడా వీరికి కడుపు మంటనా? మీపై పోరాటానికి మేము లేమా? ఇంతమంది కేసీఆర్లం. మమ్ములను దాటుకుని వెళ్లండి’ అంటూ నిరంజన్‌రెడ్డి ఆవేశంగా ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీల గొంతు నులిమేందుకు ఆ రెండు పార్టీలు ఏకమవుతున్నాయని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ సర్కారుపై దినాం నోరు పారేసుకునే వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్‌ను ప్రశ్నించేందుకు నోరు వస్తలేదు అంటూ పరోక్షంగా ఎంపీ అర్వింద్‌పై నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేతలు, కోతల ప్రభుత్వంగా మారిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏమేమి హామీలు ఎగ్గొట్టారో తెలుసుకోవడానికే బీఆర్ఎస్ పార్టీ రైతు అధ్యయన కమిటీ జిల్లాకు వచ్చిందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నపుడు నాట్లు వేసే సమయానికి రైతుబంధు ఠంచన్‌గా పడేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నాట్లప్పుడు కాకుండా ఓట్లు ఎప్పుడెప్పుడు ఉన్నయో అప్పుడే రైతుబంధు వేస్తున్నదని మండిపడ్డారు.
వానకాలం ఓట్లు లేవు అందుకే వానకాలం రైతుబంధు ఎగ్గొట్టిండ్రు, మళ్లీ గ్రామపంచాయతీ ఎన్నికలు వస్తున్నయి ఇప్పుడు రైతుబంధు వేస్తమని అంటున్నరని ధ్వజమెత్తారు. అట్లనే రుణమాఫీ విషయంలోనూ అన్ని కోతలు పెట్టి అరకొర మందికే రుణమాఫీ చేశారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో 2.03 లక్షల మందిలో కేవలం 1.01 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసిండ్రని విమర్శించారు. బాల్కొండ నియోజకవర్గంలో 51వేయి మంది రుణాలు తీసుకుంటే, రేవంత్ ప్రభుత్వం 20 వేల మందికే మాఫీ చేసిందని విమర్శించారు.
పదేండ్లు ఆనందంగా ఉన్న రైతులు ఒక్క ఈ ఏడాదిలోనే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రశ్నించారు. రైతుల చావులు చూడడానికి కాదు తెలంగాణ తెచ్చుకున్నదని, రైతులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మీ ముందుకువచ్చామని తెలిపారు. రైతుల్లో దేవుడిని చూసిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం ఉండలేదని, రైతులు ధైర్యాన్ని కోల్పోకుండా సమస్యలపై పోరాడాలని, ఇక ఆత్మహత్యలు వద్దు కొట్లాడుదామని పిలుపునిచ్చారు.
దేశంలో రైతుల ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ హయాంలో పార్లమెంట్లో కేంద్రమే ప్రకటించిందని, అలాంటిది ఇప్పుడు రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డిని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. రైతులకు ధైర్యం చెప్పేందుకు వచ్చిన తనకు బుస్సాపూర్ వచ్చాక తనకే ధైర్యం వచ్చిందని తెలిపారు. రైతులు మాట్లాడిన తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేసిందని, ఇంత అవగాహన ఉన్న రైతులు ఎట్లా కేసీఆర్‌ను చేజార్చుకున్నారంటూ నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఏవర్గమూ సంతోషంగా లేదని, కాంగ్రెస్‌కు ఓటేసిన ఆ పార్టీ కార్యకర్తలు కూడా సంతోషంగా లేరని నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇది అసలు కాంగ్రెస్ కాదని, కిరాయి కాంగ్రెస్‌లా ఉదని ఎద్దేవా చేశారు.
కృష్ణా, గోదావరి లేకపోతే తెలంగాణకు బతుకే లేదని నిరంజన్‌రెడ్డి చెప్పారు. నీళ్లు ఎట్లా దాఖలు పరుచుకోవాలో వారికి తెలయడం లేదని విమర్శించారు. నీళ్లను దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలే జరగడం లేదని చెప్పారు. లిఫ్ట్‌ల నుంచి నీళ్లు ఇచ్చుకునే పరిస్థితి లేదన్నారు. సాగునీటి సరఫరాపై రాష్ట్ర పాలకులకు పట్టింపు లేదని, ఆంధ్రోళ్లు గండిపెట్టి నదీజలాలను తరలించుకుపోయేందుకు భారీ కుట్ర జరుగుతుందని ధ్వజమెత్తారు. నిజామాబాద్ సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్ దాదాన్నగారి విఠల్‌రావు, డీసీసీబీ డైరెక్టర్ శేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీలు పాల్గొన్నారు.