Rythu Bandhu | హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరిట రూ.25 వేల కోట్లను వృథా చేసిందన్న కాంగ్రెస్ నేతల ఆరోపణలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. అంటే మూడొంతుల మంది రైతులను దొంగలుగా చిత్రీకరిస్తారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపైనే వేసిన మంత్రివర్గ ఉపసంఘం ఏడాదిలో ఏం తేల్చిందని ప్రశ్నించారు. ‘సీఎం, డిప్యూటీ సీఎం స్వగ్రామాల్లో అనర్హులకు రైతుబంధు అందిందని నిరూపిస్తరా? అని నిలదీశారు. ప్రభుత్వం వద్ద అన్ని లెకలున్నయ్, ఎందుకు బయట పెట్టడం లేదు? ఎలుకలున్నాయని ఇల్లు తగలబెడ్తరా? రైతుభరోసా అమలు చేయడం చేతగాక కాంగ్రెస్ నేతలు రైతుల మీద నిందలు వేస్తున్నారు’ అని నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
హైదరాబాద్ తెలంగాణభవన్‌లో శనివారం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందంతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ప్రజలను కాకా పట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ధోకా చేస్తున్నదని విమర్శించారు. రైతుకు సాయం చేయడం అంటే దేశ సౌభాగ్యానికి సహకారం అందించడమేనని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో 11 విడతల్లో రైతుబంధు కింద 73 వేల కోట్లను రైతులకు అందించిందని గుర్తుచేశారు. అన్నం పెట్టే రైతు యాచించే స్థితిలో ఉండొద్దని, దేశానికే ఆదర్శంగా నిలిచేలా రైతుబంధు పథకాన్ని కేసీఆర్ ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.
తెలంగాణలో ప్లాన్ ప్రకారం వ్యవసాయాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతున్నదని నిరంజన్‌రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. మొన్నటి దాకా గుట్టలు, రాళ్లు, డిజిటల్ సర్వే, ఐటీ అంటూ సాకులు చెప్పి, ఇప్పుడు అందరికీ ఇస్తామంటూనే మరోవైపు కలెక్టర్లపై కోతల భారం నెట్టారని మండిపడ్డారు. ఈ ఏడాది రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదైనా, సాగునీటి నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యుత్తు సరఫరా అస్తవ్యస్తంగా మారిందని తెలిపారు. రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలికి ముల్లుగుచ్చుకోకుండా బీజేపీ కాపాడుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్‌కు నొప్పి లేస్తే ఢిల్లీలో బీజే పీ మందు తయారు చేస్తున్నదని ఎద్దేవాచేశారు. ఎంఐఎం నేడు కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తుంటే.. బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.