పాలమూరుకు ప్రాణాధారమైన జూరాలను, దక్షిణ తెలంగాణకు జలభాండమైన శ్రీశైలాన్ని బలిపెట్టేందుకు మూడు ప్రభుత్వాలు పన్నిగ పన్నాగం, దానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ కూడా సహకరిస్తుండటం నిజమేనని, నమస్తే తెలంగాణ చెప్పింది అక్షరసత్యమని కేంద్ర జల సంఘం, రాష్ట్ర సాగునీటి రంగ నిపుణుల్లోనూ చర్చకు వచ్చింది. ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టి తెలంగాణ నలుమూలకూ పారించి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేయాలని పదేండ్ల పాటు కేసీఆర్ అహర్నిశలూ శ్రమించి ప్రాజెక్టులు కట్టిస్తే.. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఉన్న ప్రాజెక్టులను పండబెట్టి తెలంగాణ నీటి హక్కులను పక్క రాష్ర్టాలకు ధారాదత్తం చేస్తున్నాడని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
హైదరాబాద్, జూన్ 6 (నమస్తేతెలంగాణ): ‘రెండున్నరేండ్లుగా ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులను పండబెట్డిన సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రాంత బిడ్డకాదు.. ముమ్మాటికీ ఈ ప్రాంత జలద్రోహి’ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ రెండున్నరేండ్లలో 70 సార్లు ఢిల్లీకి పోయినవ్.. ఒక్కసారైనా పురిటిగడ్డకు రావా? అని తాము వందలసార్లు ప్రశ్నించిన తర్వాతే ఇప్పడు ఆయనకు సమయం దొరికిందని ఎద్దేవా చేశారు. గాలికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా గాలిమోటర్లో వచ్చి గాలిమాటలు చెప్పి వెళ్లారని విరుచుకుపడ్డారు. స్థాయిమరిచి పచ్చి అసత్యాలు చెప్పారని, అబద్ధాలకు అంగీలాగు తొడిగితే సీఎం రేవంత్‌రెడ్డి అవుతారని తనదైన శైలిలో పంచులు విసిరారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. క్రాప్‌హాలిడే ప్రకటించినందున సీఎం రేవంత్‌రెడ్డి జూరాలకు వెళ్లి అక్కడి బురదను చూసి వెళ్లిపోయారని దెప్పిపొడిచారు. ‘జూరాల సింగిల్ పిల్లింగ్ కెపాసిటీ 6.5 టీఎంసీలు.. మల్టిఫుల్ పిల్లింగ్లో వాడుకొనేది 11 టీఎంసీలు.. దానిపై 6 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టులు ఆధారపడ్డాయి’ అని గుర్తుచేశారు. అందుకే జూరాల ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి అవసరాలు తీర్చలేదని స్పష్టంచేశారు. ఈ విషయం సామాన్యులకు సైతం తెలుసని, కానీ ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి మొండిగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. అక్కడి నుంచి నార్లాపూర్‌కు వెళ్తే రిజర్వాయర్‌లో నీళ్లు కనిపించాయని చెప్పారు.
కానీ ఎన్నో ఏండ్లుగా ప్రజాప్రతినిధిగా కొనసాగుతూ ఆ ప్రాంత బిడ్డనని చెప్పుకొనే ఆయన.. జూరాల ఆధారంగా ప్రాజెక్టులను నిర్మిస్తానని చెప్పడం అజ్ఞానానికి అద్దం పడుతున్నదని చురకలంటించారు. ‘లేక లేక తీరిక తెచ్చుకొని వచ్చిన రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు జరిగిన పనులు, సాంకేతిక అంశాలపై సమీక్షించి, టన్నెల్‌లోనికి పోయి మోటర్లు, పంప్‌హౌస్‌లు, కెనాల్‌ను చూసి పెండింగ్ పనులేమిటి, ఇందుకు ఎంత డబ్బు ఖర్చువుతుందో? అనే వివరాలు చెప్పకుండా కేసీఆర్, బీఆర్ఎస్ను దూషించి వెళ్లిపోయారు’ అని తూర్పారబట్టారు.
కాంగ్రెస్ పార్టీ ద్రోహానికి రెండు తరాల పాలమూరు బిడ్డలు నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరిగిందని 2001లో కేసీఆర్ ఉద్యమం ప్రారంభించిన తర్వాతే అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ‘కానీ గతంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులను పూర్తిచేస్తామని చెప్పిన వైఎస్సార్ రెండేండ్లు తిరగకముందే కాడికింద పడేశారని ఆరోపించారు.
ఆంధ్రాలో తెలంగాణ విలీనంతో పాలమూరు ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. భీమా, అప్పర్‌కృష్ణా, తుంగభద్ర కెనాల్ విస్తరణ, తుంగభద్రలో 65 టీఎంసీల నీటి వినియోగానికి సంబంధించి హైదరాబాద్-మద్రాస్ ఒడంబడికతో కోల్పోయామని చెప్పారు. కానీ 1969 తెలంగాణ ఉద్యమ ఉధృతిని చూసి జూరాల, ఎల్ఎండీ నిర్మాణానికి అప్పటి పాలక కాంగ్రెస్ ముందుకొచ్చిందని తెలిపారు. కానీ 20 టీఎంసీలతో ప్రతిపాదించి 11 టీఎంసీలకు కుదించిన దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్ కాదా? అని నిలదీశారు.
ఏపీ సీఎం చంద్రబాబుతో కూడబలుక్కొని కర్ణాటక సర్కార్ భీమా, నెట్టెంపాడు, జూరాల ఎగువన అనేక బరాజ్‌ల నిర్మాణానికి యత్నిస్తున్నదని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. గోదావరి నల్లమల బనకచర్ల ద్వారా నీళ్లు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నరు.. అవి పూర్తయితే జూరాల దిగువకు నీళ్లేరావు.. అంతిమంగా ఏడారిగా మారేది పాలమూరు, ఎండిపోయేది తెలంగాణనేని కుండబద్దలుకొట్టారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి మనకు రావాల్సిన 90 టీఎంసీల నీళ్లను వాడుకొనేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. మొదట 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పి.. మధ్యలో 70 లక్షలకు తగ్గించి.. చివరికి కొన్నది కేవలం 60 లక్షల టన్నులు మాత్రమేనని చెప్పారు. కొన్న ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాల్లోనే మూలుగుతున్నదని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి తనపై చేసిన విమర్శలను తిప్పికొడుతూ తాను రైతునని పంచె కట్టుకోవడం మొదటి నుంచే అలవాటని, తెలంగాణకు అన్యాయం చేసిన రాజశేఖర్‌రెడ్డి తనకు ఆదర్శం కానేకాదని స్పష్టంచేశారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ధాన్యం కొనుగోలును వేగంగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఆయన, కాంగ్రెస్ పార్టీ ఘోరం పరాభావం మూటగట్టుకోక తప్పదని హెచ్చరించారు.
ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్లోనే రేవంత్‌రెడ్డి తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. నాడు 90 టీఎంసీల కోసం పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి సీడబ్ల్యూసీకి ప్రతిపాదనలు పంపించామని, 8 రకాల అనుమతులు సాధించామని చెప్పారు. కానీ ఏపీ ప్రభుత్వం మళ్లీ సీడబ్ల్యూసీలో కేసులు వేసి అడ్డుకొన్నదని ధ్వజమెత్తారు. చివరకు డీపీఆర్ వాపస్ వచ్చేలా చేసిందని ఆరోపించారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి వెనక్కి వచ్చిన డీపీఆర్ గురించి మాట్లాడకుండా కేసీఆర్‌ను దూషిస్తూ కాలయాపన చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
ద్రోహంచేసిన వారిని వదిలి.. ఉద్యమంచి, ప్రాణాలకు తెగించి తెలంగాణను సాధించిన కేసీఆర్‌పై విమర్శలు చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌ను ఎంత బాగాతిడితే, అవహేళన చేస్తే గొప్పవాడవుతాడనే మానసిక రుగ్మతతో రేవంత్‌రెడ్డి బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. చేయాల్సింది చెప్పకుండా బీఆర్ఎస్ గద్దెలు కూల్చు తం.. ఒక్కడిని గెలువనీయం అని దూషించడం దుర్మార్గమని పేర్కొన్నారు.
‘రేవంత్‌రెడ్డీ.. బీఆర్ఎస్ నుంచి ఒక్కడినీ గెలువనీయనని చెప్పడం కాదు.. పాలమూరులో నీ పార్టీ సంగతి వదలిపెట్టు.. దమ్ముంటే నువ్వు గెలిచి చూపించు.. ధైర్యముంటే మీరు, మీ మంత్రులు సెక్యూరిటీ లేకుండా రైతుల వద్దకు వెళ్లండి’ అని సవాల్ విసిరారు. అవన్నీ మరిచి పాలమూరును పరుగులు పెట్టించి, పొరుగు రాష్ట్రాలను ఒప్పించి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 90 శాతం పూర్తిచేసిన కేసీఆర్‌పై అక్కసు వెళ్లగక్కడం ఏమిటని ప్రశ్నించారు. పాలమూరుపై కేసీఆర్‌కు ఉన్న ప్రేమలో రేవంత్‌రెడ్డికి ఇసుక రేణువంత కూడా లేదని దెప్పిపొడిచారు. రియల్ ఎస్టేట్, మూసీ, కమీషన్లు, కాంట్రాక్టులపై ఉన్న శ్రద్ధ.. పాలమూరు బతుకులపై లేదని దుయ్యబట్టారు.