హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): రేవంత్ పాలనలో కాంగ్రెస్‌కు రాజకీయ ఉరి ఖాయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టంచేశారు. సభకు వస్తే గౌరవిస్తామంటూనే కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్ చావు కోరుకోవడం దుర్మార్గమని గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో తప్పులు జరిగితే ఎత్తిచూపి సరిచేయాల్సింది పోయి అభాండాలు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆదిత్యానాథ్‌దాస్ సమర్థుడైన అధికారే అయితే 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో పూర్తయిన ప్రాజెక్టులెన్నీ అని నిలదీశారు.
తాజా నియామకం ద్వారా రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు పరుగులు పెట్టించారని ప్రశ్నించారు. బనకచర్ల నిర్మాణానికి సీఎం రేవంత్ ఒప్పుకున్న విషయం బట్టబయలు కావడంతో తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబడుతున్నానని గ్రహించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని నిప్పులుచెరిగారు. తెలంగాణకు నాడు, నేడు ద్రోహం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టంచేశారు. అలాంటి దుర్మార్గపు పార్టీకి బుద్ధిచెప్పేందుకు సమయం కోసం తెలంగాణ సమాజం ఎదురుచూస్తున్నదని తేల్చిచెప్పారు.