హైదరాబాద్, జూన్18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉన్నది పేపర్‌లెస్ క్యాబినెట్ కాదని, ఫెయిత్లెస్ క్యాబినెట్ అని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. విశ్వాసఘాతుక క్యాబినెట్ అని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పంటలు కొనుగోలు చేయడం చేతకాదా? అని ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఎందుకు కేంద్రాన్ని సాకుగా చూపి రైతుల గొంతుకోస్తున్నాడని ప్రశ్నించారు. పంటల కొనుగోలులో సర్కార్ చేతులెత్తేయడం దారుణమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కోటా మేరకే పంటలు కొనుగోలు చేస్తామని క్యాబినెట్లో తీర్మానించడం అంటే కొనుగోలు బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకోవడమేనని ధ్వజమెత్తారు.
పంటల కొనుగోలుపై రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఈ నిర్ణయం వెనక్కి తీసుకొని నూరుశాతం పంటలు కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. క్యాబినెట్ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పంటలు కొనుగోలు చేయబోమని చెప్పిన మంత్రివర్గం.. మీడియా సాక్షిగా తన చేతగానితనాన్ని ఒప్పుకొన్నదని ఆరోపించారు. రైతుభరోసా నిధులు విడుదల చేయడానికి బహిరంగ సభలు ఎందుకని ప్రశ్నించారు. గత యాసంగిలో రెండు సభలు పెట్టి రెండు ఎకరాలకే వేసి చేతులు దులుపుకొన్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో 11 విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.72 వేల కోట్లు నేరుగా జమ చేసినా ఇలా సభలు పెట్టి షోలు చేయలేదని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం సూచించిన సన్నరకాలు సాగు చేస్తే రైతులు ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి నష్టపోతారని నిరంజన్‌రెడ్డి తెలిపారు. క్వింటాలుకు రూ.500 బోనస్ ఎగ్గొట్టడానికే 7 రకాల సన్నాల సాగు అంటూ సర్కార్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం విద్యుత్తు సరఫరాలో, రైతు భరోసా ఇవ్వడంలో చేతులెత్తేసిన సర్కార్.. రైతు కుటుంబాలకు ధీమాగా ఉన్న రైతుబీమాను నిలిపేసిందని ధ్వజమెత్తారు. రుణమాఫీ విషయంలోనూ చేతులెత్తేసిన ప్రభుత్వం.. ఇప్పుడు పంటలు కొనుగోలు చేయబోమని నిస్సిగ్గుగా ప్రకటించిందని మండిపడ్డారు.