హనుమకొండ, జూలై 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ సాధన పోరాటంలో ఉద్యమ నేత కేసీఆర్‌తో కలిసి నడిచిన పెద్ది సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే పంథా కొనసాగించారు. సివిల్ సప్లయ్ శాఖలో జరిగిన భారీ అవినీతిపై పోరాటం చేశారు. ఆరోపణలు, ఆధారాలకు రేవంత్ సర్కార్ స్పందించకపోవడంతో సుదర్శన్‌రెడ్డి న్యాయపరంగా ముందుకు సాగారు. సివిల్ సప్లయీస్ శాఖలో రూ.1,100 కోట్ల ధాన్యం టెండర్ల కుంభకోణం జరిగిందని పెద్ది బయటపెట్టారు. 35 లక్షల టన్నుల ధాన్యం విక్రయం, సన్నబియ్యం కొనుగోలు టెండర్లలో భారీ అవకతవకలు జరిగాయని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నాలుగు కంపెనీలకు టెండర్లు కట్టబెట్టారని వివరించారు. ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆశ్రయించారు.
బీఆర్ఎస్ హయాంలో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల నుంచి వడ్ల కొనుగోలు విషయంలో ఇబ్బందుల గురించి క్షుణ్ణంగా పరిశీలించారు. ఒక మిల్లు నుంచి మరో మిల్లుకు బియ్యం తరలించకుండానే రికార్డులను మార్చి అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అన్ని వివరాలతో రూ.1,100 కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టారు. అవినీతిపై విచారణ జరుపాలని రాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపీకి పలుసార్లు లేఖలు రాశారు. భారీ స్థాయిలో జరిగిన అవినీతిపై 715 పేజీల కీలక సాక్ష్యాధారాలతో కేంద్ర సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి ఫిర్యాదు చేశారు. సివిల్ సప్లయిస్‌లో కుంభకోణంపై సుప్రీంకోర్టు, హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. విద్యా శాఖలోనూ వందల కోట్ల కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చారు. రూ.17 వేల బంకర్ బెడ్‌ను రూ.33 వేలకు కొనుగోలు చేసినట్టు చూపడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్యలు కొందరు వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని పెద్ది పేర్కొన్నారు. ప్రజల సొమ్మును కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొందరు అక్రమంగా దోచుకుంటున్న సందర్భాల్లో పెద్ది సుదర్శన్‌రెడ్డి ఉద్యమ పంథాను కొనసాగించి అవినీతిని వెలుగులోకి తెచ్చి స్ఫూర్తి దాయకంగా నిలిచారని బీఆర్ఎస్ శ్రేణులు గుర్తుచేసుకుంటున్నాయి.
హైదరాబాద్, జూలై 31(నమస్తే తెలంగాణ): పదవులు అంటే హంగూ ఆర్భాటాలు కాదు.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమని నిరూపించారు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి. 2016 నుంచి 2018 వరకు సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్‌గా వేతనం తీసుకోకుండా నిస్వార్థంగా సేవలందించిన అరుదైన నాయకుడిగా నిలిచారు. రెండేండ్ల పదవీకాలంలో నిబద్ధతతో పనిచేసి కష్టాల్లో రైతాంగానికి భరోసానిచ్చారు. పంట ఉత్పత్తుల కొనుగోలు ప్రక్రియలో సంస్కరణలు తీసుకువచ్చి సరళీకరణకు కృషి చేశారు. ధాన్యం కొనుగోలు ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేవరకు ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా రాత్రింబవళ్లు పర్యవేక్షించేవారు. ప్రతిరైతు ఖాతాలో ధాన్యం డబ్బులు జమయ్యేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేవారు.