బంజారాహిల్స్, నవంబర్ 5: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి తప్పదని గ్రహించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసహనంతో ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని రహ్మత్‌నగర్‌లో బుధవారం ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీరాంనగర్‌లో రోడ్‌షోలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన అభ్యంతరకర వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని మండిపడ్డారు. రెండేండ్లుగా మున్సిపల్ శాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. హైదరాబాద్ నగరంలో తిష్టవేసిన సమస్యలను తీర్చలేకపోయారని విమర్శించారు.
ఎక్కడ చూసినా చెత్తకుప్పలు పేరుకుపోయాయని, మురుగునీరు, దోమల విజృంభన, విషజ్వరాలతో నగర ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి సమస్యలతో జనం ఇబ్బందులు పడుతుంటే పాలన చేతగాక.. కేటీఆర్‌ను దూషించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి తప్పదని ఇంటెలిజెన్స్ నివేదికలతోపాటు అనేక సర్వేలు తేల్చిచెప్పడంతో సీఎం అయోమయంలో పడ్డారని ఎమ్మెల్సీ రవీందర్రావు విమర్శించారు. ఆయన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ము లేదని, అధికారుల అవినీతిని అరికట్టే సత్తా లేదని, సాక్ష్యాత్తూ సొంత పార్టీ నేతలే చెప్తున్నారని తెలిపారు. మాగంటి సునీతా గోపీనాథ్‌ను గెలిపించేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు.
బీజేపీకి ఒక రూల్.. బీఆర్ఎస్కి మరొకటా?
ఎన్నికల నియమావళి అమల్లో భారత ఎన్నికల సంఘం (ఈసీ) ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. బీహార్‌లో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి మహిళా ఉద్యోగ యోజన కింద ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మహిళల ఖాతాల్లో జమ చేయడానికి ఎన్నికల సంఘం అనుమతివ్వడం శోచనీయమని ఆక్షేపించారు. కానీ, తెలంగాణలో 2018 నుంచే కొనసాగుతున్న రైతుబంధు పథకాన్ని గత ఎన్నికల సమయంలో ఆపివేయడం ఈసీ పక్షపాత ధోరణికి నిదర్శమని బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
రాజ్యాంగంలో బీజేపీకి ఒక నిబంధన, బీఆర్ఎస్కి మరో నిబంధన ఉన్నదా? అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ మధ్యలో కొత్త పథకానికి అనుమతి ఇవ్వడం బీజేపీకి లాభం చేకూర్చడానికేనని మండిపడ్డారు. ఎన్నికల నియమావళి అక్టోబర్ 8న అమల్లోకి రావడానికి కేవలం 12 రోజుల ముందు, ప్రధాని మోదీ 2025 సెప్టెంబర్ 26న ‘ముఖ్యమంత్రి మహిళా ఉద్యోగ యోజన’ను ప్రారంభించారని గుర్తుచేశారు. అయినా ఎన్నికల సంఘం ఓటింగ్‌కు నాలుగు రోజుల ముందు ఈ పథకం కింద రూ.10,000 చొప్పున మహిళల ఖాతాల్లో జమ చేయడానికి అనుమతి ఇవ్వడంపై విస్మయం వ్యక్తంచేశారు. ఇది ఎన్నికల నియమావళి ఉద్దేశాన్ని పూర్తిగా తుంచేసిన చర్యగా, బీజేపీకి ఎన్నికల్లో ప్రయోజనం కల్పించడానికి తీసుకున్న నిర్ణయంగా పేర్కొన్నారు.