BRS | హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేతలు, అక్రమ అరెస్టులకు భయపడేదిలేదని బీఆర్ఎస్ నేతలు తేల్చిచెప్పారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. నియంత పాలనను తలపించేలా సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని భగ్గుమన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, తాతా మధు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, శేరి సుభాశ్‌రెడ్డి, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, చింతా ప్రభాకర్, డాక్టర్ సంజయ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, శంకర్‌నాయక్, మర్రి జనార్దన్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, పల్లె రవి, దేవీప్రసాద్ సహా పలువురు పార్టీ నేతలు హరీశ్‌రావును కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మీడియాతో మాట్లాడారు.
వలసవాదులకన్నా దుర్మార్గం: పల్లా
వలసవాదులు చేయని దుర్మార్గాన్ని రేవంత్ సర్కార్ చేస్తున్నదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి నిప్పులుచెరిగారు. మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసేటప్పుడు అనుసరిస్తున్న విధానాన్నే బీఆర్ఎస్ నాయకుల అరెస్టుల సందర్భంలో పోలీసులు అనుసరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో భాగమైన పోలీసులు రేవంత్‌రెడ్డి జీతగాళ్లుగా వ్యవహించకూడదని సూచించారు. ఉద్యమంలో అనేకసార్లు జైళ్లకు పోయినోళ్లమని, వందల కేసులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ఏ చట్ట ప్రకారం అరెస్టు చేశారో చూపకుండా ఆఖరికి పోలీస్ సర్వర్ డౌన్ చేయటం సిగ్గుచేటని, కౌశిక్‌రెడ్డి ఇంటిని చుట్టుముట్టి తలుపులు పగులగొట్టి అరెస్టు చేస్తున్న విషయాన్ని తెలుసుకొని అక్కడికి వెళుతున్న హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేశారని, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని కూడా అరెస్ట్ చేశారని, ఇలా ఎంతమందిని అరెస్టు చేస్తారని ప్రశ్నించారు.
జైల్లో వేసినా వదిలేది లేదు: దయాకర్‌రావు
దేశం, రాష్ట్రం నాశనమైంది కాంగ్రెస్ వల్లేనని, ఇందిరాగాంధీ మొదలుకొని సోనియా, రాజశేఖర్‌రెడ్డి, రాహుల్‌గాంధీ దాకా ఒక్కొక్కరిని తిట్టిపోసిన రేవంత్‌రెడ్డి ఇవ్వాళ ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందని చెప్పటం సిగ్గుచేటని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది, అభివృద్ధి జరిగింది కేసీఆర్ నాయకత్వంలోనేనని స్పష్టంచేశారు. రేవంత్‌రెడ్డి మోసకారి అని దేశమంతా తెలుసని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు నిలదీస్తే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. అరెస్టు చేసినా, దెబ్బలు కొట్టినా..జైల్లో పెట్టినా రేవంత్‌రెడ్డిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఏడాదిలోనే లక్ష కోట్ల అప్పు చేసిన రేవంత్‌కు అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కులేదని దుయ్యబట్టారు.
ప్రజలే చరమగీతం పాడుతరు : సిరికొండ
రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాపాలన కాదని, పాపాల పాలన అని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ఏడాది కాలంలోనే అనేక పాపాలు చేస్తున్నాడని మండిపడ్డారు. తాను మాట్లాడిన మాటలను తానే వక్రీకరిస్తూ తెలంగాణ ప్రజలకు సీఎం తీరని ద్రోహం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ దుర్మార్గాన్ని అడుగడుగునా నిలదీస్తున్న హరీశ్‌రావు, కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నేతలపై కక్ష పెంచుకొని కావాలనే కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని, ప్రభుత్వాన్ని నిలదీస్తే సమాధానం చెప్పాల్సిందిపోయి అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. శిశుపాలుడికి వంద తప్పుల తర్వాత శిక్ష పడినట్టుగానే కాంగ్రెస్ పార్టీని, రేవంత్‌రెడ్డిని ప్రజలు తప్పకుండా శిక్షిస్తారని హెచ్చరించారు.
సీఎం బ్రదర్స్‌పై కేసు పెట్టరా?: సబిత
కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి తన చావుకు సీఎం, ఆయన సోదరులు కారణమని సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నారని, ఈ విషయంలో వారిపై కేసు ఎందుకు పెట్టడం లేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. దేశంలోఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అధికార పక్షానికి ఓ చట్టం, ప్రతిపక్షానికి మరో చట్టం అమలవుతున్నదని విమర్శించారు. లగచర్ల బాధితుల అక్రమ అరెస్టులు, గురుకుల విద్యార్థుల మరణాలపై అధ్యయనం చేసేందుకు వెళ్లిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సహా ఇతర నాయకులపై కేసులు, ఆఖరికి జర్నలిస్టులపై కేసులు పెట్టడం కాంగ్రెస్ అణచివేత ధోరణని స్పష్టం చేస్తున్నదని దుయ్యబట్టారు. హరీశ్‌రావుపై కుట్రపూరితంగా కేసు పెట్టారని, ఏసీపీ అనుమతి తీసుకొని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేయటం దుర్మార్గమని మండిపడ్డారు.
నిరసనగా అంబేద్కర్‌కు నివాళి: వేముల
సీఎం రేవంత్‌రెడ్డి నియంత పాలనకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రతిపక్ష నాయకుడిగా తానెక్కడికైనా స్వేచ్ఛగా వెళ్తానని చెప్తుంటే ఇక్కడ రేవంత్‌రెడ్డి మాత్రం శాసనమండలి విపక్షనేత సిరికొండ మధుసూదనాచారిని ఎక్కడికీ వెళ్లనివ్వకుండా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీపాలన సాగుతున్నదని దుయ్యబట్టారు. శుక్రవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పార్టీ శ్రేణులంతా కలిసి ఆ మహనీయుడికి నివాళి అర్పిస్తామని చెప్పారు. రేవంత్‌రెడ్డి ఎమర్జెన్సీ రోజులను తలపించేలా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.
ఎమర్జెన్సీ కన్నా దారుణం: గంగుల
కరీంనగర్ కార్పొరేషన్, డిసెంబర్ 5: ‘రాష్ట్రంలో ఎమర్జెన్సీ కంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధుల గొంతులను కూడా నొక్కుతున్నదని, ఎమ్మెల్యేలకు కనీస స్వాతంత్య్రం లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని, ఇలాంటి అరెస్టులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రజలే కాంగ్రెస్‌కు తగిన రీతిలో బుద్ధి చెప్తారని హెచ్చరించా రు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును సహించేంది లేదని, ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతామని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్టు హేయం ; దాసోజు శ్రవణ్
హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి సర్కారు ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నదని బీఆర్ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంట్లోకి పోలీసులు అనుమతి లేకుండా చొరబడి, తలుపులు పగలగొట్టి అరెస్టు చేయడం రేవంత్‌రెడ్డి నిరంకుశ పాలనకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన కౌశిక్‌రెడ్డిపై ఉల్టా కేసు పెట్టి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హరీశ్‌రావుపై ఒక చీటర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, జైలుకు పంపేందుకు కుట్ర పన్నడం అన్యాయమని ఆక్షేపించా రు. ‘ఎంత మందిని అరెస్టు చేస్తావ్ రేవంత్‌రెడ్డి? పదేండ్లు ప్రతిపక్షంలో ఉన్నవ్. మిమ్మల్ని ఎన్నిసార్లు అరెస్టు చేయాలి? మీ సోదరుల దాష్టీకాలపై నోరు ఎందుకు మెదడం లేదు?’ అని రేవంత్‌రెడ్డిని నిలదీశారు.