హైదరాబాద్, ఫిబ్రవరి 6(నమస్తే తెలంగాణ) : ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన అధికారంలోకి వచ్చి న తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లు, పెట్టి న పరీక్షలు, భర్తీ చేసిన ఉద్యోగాల లెక్కల విషయంలో కేసీఆర్ దాకా ఎందుకని శుక్రవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. అశోక్‌నగర్ లైబ్రరీలోని నిరుద్యోగులే లెక్కగట్టి చెబుతారని చురకలంటించారు.
ఉద్యోగాల లెక్కలు తేలిన తర్వాత రేవంత్ తలనరుక్కుంటాడో, నిరుద్యోగులతో నరికించుకుంటాడో ఆయన కర్మ అని దెప్పిపొడిచారు. నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దంటున్నారని సీఎం చెప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఆయన చెప్పింది నిజమైతే ఇందిరాపార్క్, అశోక్‌నగర్ చౌరస్తాలో ఉద్యోగాల కోసం ధర్నా చేస్తున్న నిరుద్యోగులపై ఎందుకు లాఠీచార్జ్ చేయించారని నిలదీశారు. అడ్డగోలు మాటలతో రెచ్చిపోతున్న రేవంత్‌కు త్వరలో రాజకీయ ఉరి తప్పదని హెచ్చరించారు.