Palamuru | పాలమూరు ప్రాజెక్టులపై విషం చిమ్ముతూ, పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం పాకులాడుతున్న కాంగ్రెస్ నేతల తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. నిజానిజాలను ప్రజలముందు ఉంచేందుకు మంగళవారం ప్రాజెక్టుల బాట చేపట్టింది. జూరాల ప్రాజెక్టును, నార్లాపూర్ రిజర్వాయర్‌ను పాలమూరుకు చెందిన బీఆర్ఎస్ ముఖ్యనేతల బృందం పరిశీలించింది. జూరాల పేరుతో పాలమూరుకు రేవంత్ సర్కార్ ఉరితాడు పేనుతున్నదని మాజీమంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు.

వనపర్తి, జనవరి 6 (నమస్తే తెలంగాణ): సాగునీటిరంగంలో తెలంగాణకు ద్రోహం చేస్తూ, ఆంధ్రప్రదేశ్‌కు లాభం చేకూర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును జూరాలపై ఏర్పాటుచేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనతో ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులకు ఉరి వేసినట్టేనని విమర్శించారు. మంగళవారం జూరాల ప్రాజెక్టును ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డితోపాటు ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్ తదితరులతో కూడిన బీఆర్ఎస్ బృందం పరిశీలించింది.
అనంతరం మీడియాతో నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు కృష్ణానదిలో సాగునీటి వనరులు దక్కకుండా కాంగ్రెస్ ప్రభుత్వాలు నాడు, నేడు ఒకే తీరుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా తెలంగాణ కోసం ఏర్పాటుచేయలేదని దుయ్యబట్టారు. సిద్ధేశ్వరం-మల్లేశ్వరం వద్ద నిర్మించాల్సిన శ్రీశైలం ప్రాజెక్టును 86 కిలోమీటర్లు ముందుకు తీసుకెళ్లి నిర్మించారని, దీంతో తెలంగాణలోని వందలాది గ్రామాలు నీట మునిగాయని, భూములతోపాటు లక్షలాది తెలంగాణ కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయని ఆవేదన వ్యక్తంచేశారు.
నాగార్జునసాగర్‌ను సైతం 26 కిలోమీటర్లు ముందుకు తీసుకెళ్లి నిర్మించి తెలంగాణకు తీరని నష్టం చేశారని ఆరోపించారు. ఇలా ఈ రెండు ప్రాజెక్టులను ఆంధ్రా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే నిర్మించారని విమర్శించారు. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో సాగునీటి పరంగా అనేక కుట్రలు జరుగుతూనే ఉన్నాయని దుయ్యబట్టారు. విద్యుత్తు ఉత్పత్తి పేరుతో నిర్మాణం చేసిన శ్రీశైలంలో అధిక శాతం నీటిని సాగుకు వాడుకుంటున్న ఆంధ్రపదేశ్.. ఇప్పుడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి నీటిని వాడుకోకుండా ఆటంకాలు కల్పిస్తున్నదని మండిపడ్డారు. అందులో భాగంగానే రెండేండ్లయినా పాలమూరు ప్రాజెక్టులో తట్ట మట్టి కూడా ఎత్తకుండా కొర్రీలు వేసే పనికి పూనుకున్నదని విమర్శించారు.
ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావొచ్చిన దశలో ఏపీ ప్రభుత్వం లోపాయికారిగా వ్యవహరిస్తూ ఆటంకాలు కలిగిస్తున్నదని ధ్వజమెత్తారు. గత నైజాం పాలనలోనే ఉమ్మడి పాలమూరు ప్రయోజనాల కోసం కర్ణాటక ప్రాంతంలో అప్పర్ కృష్ణా, భీమా ప్రాజెక్టులను ప్రతిపాదిస్తే.. అనంతరం నెహ్రూ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 45 టీఎంసీలకు కుదించాలనే ప్రయత్నం కూడా ఏపీ కుట్ర ద్వారానే పుట్టిందని మండిపడ్డారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం ఏపీ సర్కార్ తెరవెనుక ఉంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కీలుబొమ్మలా ఆడిస్తున్నదని ఆరోపించారు. పాలమూరుకు 90 టీఎంసీల నీళ్లు అవసరమని, ఇది జూరాల ద్వారా సాధ్యం కాదని, కనీస పరిజ్ఞానం ఉన్నోళ్లకు కూడా అర్థమవుతుందని పేర్కొన్నారు. కొడంగల్ ఎత్తిపోతల ద్వారా ప్రజాధనం వృథా కావడం మినహా ప్రయోజనం లేదని దుయ్యబట్టారు. పాలమూరు ప్రాజెక్టు ద్వారానే నారాయణపేట, కొడంగల్ ప్రాంతాల్లోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా తాము డిజైన్ చేసినట్టు వివరించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా రైతుల ప్రయోజనాల కోసం మళ్లీ జలయజ్ఞం ఉద్యమాన్ని చేపడుతామని చెప్పారు.

సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్తోపాటు పలువురు మంత్రులు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. జూన్ 2021లో విడుదలైన జీవో-24ను మరోసారి చదువుకుంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల కోసం ఎలాంటి ప్రయత్నాలు చేసిందో తెలుస్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ నష్టపోయింది ఉమ్మడి పాలమూరు జిల్లాయేనని ఆవేదన వ్యక్తంచేశారు. వందశాతం కృష్ణా బేసిన్లో ఉండి కూడా 12 లక్షల మందిని వలసలకు నిలయం చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ పాలకులకు తలొగ్గకుండా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిన పనులను పూర్తి చేసి రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి పేరుకే సొంత జిల్లా ముఖ్యమంత్రి తప్ప, ఈ ప్రాంతానికి నయాపైసా ఉపయోగం లేదని విమర్శించారు.
జూరాల నుంచి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 70 టీఎంసీల నీటిని తరలించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఇప్పటికే జూరాల ఎండిపోతున్నదని, కాంగ్రెస్ ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించి చేతులు దులుపుకొన్నదని దుయ్యబట్టారు. జూరాల నుంచి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి తరలింపు అసాధ్యమని, కేవలం ఐదారు టీఎంసీలే జూరాలలో ఉంటాయని, శ్రీశైలంలో 220 టీఎంసీల వరకు నీళ్లు ఉంటాయని వివరించారు. తెలంగాణ వాదం వచ్చిన తర్వాతే జూరాల కూడా పూర్తయిందని, అలాగే గతంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసిన ఘనత బీఆర్ఎస్దేనని స్పష్టంచేశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును జూరాల నుంచి సాధ్యం కాదని, అప్పట్లో అందరికీ చెప్పి శ్రీశైలానికి మార్పు చేసినట్టు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును వెంటనే పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. కనీస అవగాహన లేకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారానే కొడంగల్-నారాయణపేటలోని 2 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా డిజైన్ ఉన్నదని చెప్పారు. కేవలం రూ.5 వేల కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి రిజర్వాయర్లకు నీరందించవచ్చని తెలిపారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వచ్చి ఉంటే కేవలం ఆరు నెలల్లోనే పాలమూరు ప్రాజెక్టు పూర్తయ్యేదని పేర్కొన్నారు.