పెబ్బేరు, ఫిబ్రవరి 9 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా జీవంలేని రాయిగా ఉండిపోయిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. పురపాలక ఎన్నికల్లో భాగంగా సోమవారం ఆయన వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పల్లెలు, పట్టణాలన్నీ బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి చెందినట్టు తెలిపారు. పట్టణాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి వసతి, మురుగు కాల్వల నిర్మాణం, లేఅవుట్ల క్రమబద్ధీకరణ, పార్కుల ఏర్పాటు వంటి పనులు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే చేపట్టినట్టు పేర్కొన్నారు.
ప్రస్తుతం చెత్తను తీసుకెళ్లే ట్రాక్టర్లకు డీజిల్ పోయించలేని స్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొన్నదని విమర్శించారు. దేశంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇచ్చే రాష్ట్రంగా బీఆర్ఎస్ హయాంలో కొనసాగితే.. ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నదని దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే కాంగ్రెస్‌కు వేసినట్టేనని, ఈ ఎన్నికల వల్ల బీజేపీకి లాభం జరగదని చెప్పారు. ప్రజలు ఆలోచించి పట్టణాలు అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్నే గెలిపించి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్పాలని కోరారు.