పెద్దపెల్లి/మంచిర్యాల: ప్రధాని మోదీ రామగుండం పర్యటనపై కార్మికలోకం భగ్గుమంటున్నది. ఈనెల 12 మోదీ రామగుండంలో పర్యటించనున్నారు. దీనికి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్లోని సింగరేణి గనుల వద్ద కార్మికులు ఆందోళన నిర్వహించారు. బొగ్గు పరిశ్రమల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మోదీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఏరియా బొగ్గు గనుల వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. టీజీబీకేఎస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న మోదీ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు.