హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు సింగరేణి సంస్థ బ్యాంక్ బ్యాలెన్స్ రూ.3,540 కోట్లు. అప్పుడు డిపాజిట్లు, బాండ్ల కోసం బ్యాంకులు సింగరేణి వద్దకు క్యూ కట్టేవి. అధిక వడ్డీలు ఆశజూపేవి. కానీ ఇప్పుడు సీన్‌రివర్స్ అయ్యింది. ఇప్పుడు ఓడీ, తాత్కాలిక అప్పుల కోసం సింగరేణి సంస్థే బ్యాంకులకు క్యూ కడుతున్నది. తక్కువ వడ్డీలకు అప్పులివ్వండి అంటూ బతిమిలాడుతున్నది. ఎప్పుడూ లేనంతగా ఈ రెండేండ్లలోనే సంస్థ ఆర్థిక పరిస్థితి దా‘రుణ’ంగా పడిపోయింది. ప్రస్తుతం ఉద్యోగుల వేతనాలు, అన్ని ఖర్చుల నుంచి గట్టేందుకు సుమారు రూ.3వేల కోట్లు అప్పులు తేవాల్సిన దుస్థితికి దిగజారింది.
నెలకు రూ.3వేల కోట్ల అప్పులు
సింగరేణి సంస్థ నెలకు రూ.3వేల కోట్లు తాత్కాలిక అప్పులు తెస్తున్నట్టు సింగరేణి కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. బాండ్లకు కుదువపెడుతున్నదని ఓ కార్మిక సంఘం నేత చెప్పారు. సంస్థలోని ఉద్యోగులు నెలవారీ వేతనాలు, డీజిల్ ఖర్చులు, నిర్వహణ కోసం నెలకు మూడు వేల కోట్లు అప్పు చేయనిదే కుదరడం లేదట. సంస్థ అధికారుల వాహనాలకు డీజిల్ పోయించే పరిస్థితిలేదట. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకపోవడంతో ఆయా సంస్థ డీజిల్ సరఫరాను ఆపేసిందట. పైస్థాయి అధికారులు కల్పించుకొని, ఉద్దెరకు డీజిల్ పోయాలంటూ ఐవోసీఎల్ అధికారులతో సంప్రదింపులు జరిపారంటే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. మణుగూరు, కొత్తగూడెంలో ఉద్యోగులకు సంస్థనే డీజిల్ సరఫరా చేస్తుంది. ఇప్పుడు డీజిల్ సరఫరా చేసేందుకు అధికారులు పాట్లు పడుతున్నారని సమాచారం.
ఇదీ పరిస్థితి
లేఖల యుద్ధం
విద్యుత్తు సంస్థలైన టీజీ ట్రాన్స్‌కో, జెన్కోలు రూ.47వేల కోట్లు సింగరేణికి బకాయిపడ్డాయి. దీంట్లో జెన్కోవే రూ.29,009 కోట్లున్నాయి. 2022-23లో జెన్కో బకాయిలు రూ.19,224 కోట్లుంటే, 2023-24కు వచ్చేసరికి రూ.24,924కోట్లు, 2024-25లో 29,009 కోట్లకు చేరాయి. బకాయిలు గుట్టల్లా పేరుకుపోతుండటంతో సంస్థ ఆర్థిక పరిస్థితి కుదేలవుతున్నది. తమకు రావాల్సిన బకాయిలను ఇప్పించాలని సింగరేణి తరచూ కోరుతున్నది. కొంతకాలం క్రితం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల వద్ద సంస్థ అధికారులు మొరపెట్టుకున్నా సర్కార్ నుంచి కనీస స్పందన కరువయ్యింది. ఇదే క్రమంలో టీజీ జెన్కో ఓ లేఖాస్ర్తాన్ని సంధించింది. సింగరేణిని ఆత్మరక్షణలో పడేసేలా బొగ్గు నాణ్యత లేదని, నాసిరకం బొగ్గు సరఫరా చేస్తున్నారని, తాము ప్రత్యామ్నాయ మార్గాల్లో బొగ్గును సమకూర్చుకుంటామని ఓ లేఖను పేర్కొన్నది. దీంతో సింగరేణి కాస్త వెనక్కి తగ్గింది. జెన్కో లేఖ విషయంపై సింగరేణి స్పందిస్తూ లేఖలు సహజమని, ఇలాంటివి పది, పదిహేను రోజులకొకటి వస్తాయని కొట్టిపారేసింది.