జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ)/గోదావరిఖని: సింగరేణి సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరం లాభాల వాటా 33 శాతాన్ని సోమవారం కార్మికులకు పంపిణీ చేసింది. రూ.796.05 కోట్ల లాభాల వాటా పంపిణీ చేస్తున్నట్టు సర్క్యులర్లో పేర్కొన్న యాజమాన్యం.. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాలు ఎంత అనేది? పేర్కొనకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో లాభాల ప్రకటన వాటాను చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈసారి అందుకు భిన్నంగా లాభాల వాటా చెల్లిస్తున్నట్టు మాత్రమే పేర్కొన్నది. సంస్థకు ఎంత నికర లాభం వచ్చిందనే అంశాన్ని మాత్రం కప్పిపుచ్చింది. సింగరేణి సంస్థలో కొంతకాలంగా యాజమాన్యం ప్రకటించిన విధంగా రూ.4,701 కోట్ల లాభాల్లో కార్మికుల వాటా 33 శాతం చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం మాత్రం సింగరేణి విస్తరణ అవసరాల కోసం రూ.2000 కోట్లకు పైగా నిధులను పక్కనపెట్టి కేవలం రూ.2,412 కోట్ల నిధులపై మాత్రమే 33 శాతం వాటాగా రూ.796.05 కోట్లను చెల్లిస్తున్నట్టుగా పేర్కొన్నది. వాస్తవంగా సింగరేణి సంస్థ సాధించిన రూ.4,701 కోట్లలో 33 శాతం వాటాగా రూ.1,551 కోట్లు రావాల్సి ఉంది. దాదాపు రూ.755 కోట్లను కార్మికులకు ఇవ్వకుండా లాభాలను తక్కువగా చూపించిందన్న విమర్శలు వస్తున్నాయి. వాస్తవ లాభాలపై వాటా చెల్లించాలని బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు కొంతకాలంగా ఆందోళనలు, ధర్నాలు చేపడుతున్నారు.
కార్మికులకు రావాల్సిన లాభాల వాటాను గుర్తింపు కార్మిక సంఘం నాయకులు, ప్రభుత్వం సగానికి దోచుకున్నాయి. లాభాల వాటాను రూ. 755 కోట్లు తగ్గించారు. కార్మికులకు రూ.4,701 కోట్లపై 33 శాతం వాటా చెల్లించాల్సి ఉండగా రూ.1,551 కోట్లపై రూ.796 కోట్లు మాత్రమే చెల్లించారు. అంటే కార్మికులకు 16.9 శాతం మాత్రమే చెల్లించారు. ఒక్కో కార్మికుడు రూ.1.80 లక్షలు నష్టపోయాడు. లాభాల వాటా సర్క్యులర్లో నికర లాభాలు ఎన్ని వచ్చాయి? ఎంత చెల్లిస్తున్నారనే విషయాన్నే పేర్కొనకపోవడం బాధాకరం. ఇది కార్మికులను మోసం చేయడమే. గుర్తింపు సంఘం ఈ విషయమై ఎందుకు నోరు మెదపడం లేదు. కార్మికుల హక్కులను ప్రభుత్వానికి తాకట్టు పెట్టారు. -మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు