హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): సింగరేణి వేలాన్ని నిరసిస్తూ జూలై 5న కోల్‌బెల్ట్ బంద్‌కు సీపీఐ పిలుపునిచ్చిదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులపాటు నిరాహార దీక్షలు, కలెక్టరేట్లను ముట్టడి చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ర్టానికే తలమానికమైన సింగరేణి వేలాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని హితవు పలికారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న సింగరేణిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సింగరేణి లేకపోతే బొగ్గు ఆధారిత పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు.
భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట సీపీఐ ధర్నా
బొగ్గు గనులను వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తెలంగాణ నుంచి కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి సింగరేణి ప్రైవేటీకరణ చర్యలను అడ్డుకోకపోవడం సిగ్గుచేటని ఆ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ రాహుల్ శర్మకు అందజేశారు. సీపీఐ జిల్లా సమితి సభ్యుడు రమేశ్, భూపాలపల్లి పట్టణ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, నాయకులు సతీశ్‌కుమార్, సుధాకర్‌రెడ్డి, రామచందర్, జోసెఫ్, ఆసిఫ్ పాషా పాల్గొన్నారు.