మహబూబ్‌నగర్ నెట్వర్క్/యాదాద్రి భువనగిరి/సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున జల్లులతో మొదలైన వర్షం.. తెల్లారేసరికి కుండపోతగా కురిసింది. చెరువులు, కుంటలు నిండిపోయి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించాయి. 2 గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి గ్రేటర్ హైదరాబాద్ అతలాకుతలం అయ్యింది. భారీగా వరద నీరు చేరి రహదారులు చెరువులను తలపించాయి. మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లాయి. వర్షపు నీరు నిలిచి భారీగా ట్రాఫిక్ స్తంభించింది. రాంనగర్ ప్రేయర్ పవర్ చర్చి ప్రాంతానికి చెందిన బీ విజయ్ కుమార్ (43) ఇంటిముందు అరుగుపై నిద్రిస్తుండగా.. ఒక్కసారిగా వచ్చిన వదరలో చిక్కుకుని ఊపిరాడక మృత్యువాత పడ్డాడు. పంజాగుట్ట సుఖ్‌నివాస్ అపార్ట్మెంట్ వద్ద పిడుగుపడి కారు, ఎల్బీ స్టేడియం ప్రహరీ కూలి పోలీస్ వాహనం ధ్వంసం అయ్యాయి. అత్యధికంగా ఖైరతాబాద్ మండలంలో 12.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరద నుంచి మధ్యాహ్నానికి తేరుకున్నా.. అస్తవ్యస్తంగా మారిన జనజీవనంపై సాయంత్రం వరుణుడు మళ్లీ ఉగ్రరూపం చూపాడు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా.. జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు, చెరువులు అలుగులు పోశాయి. అయిజ-కర్నూల్, అయిజ-ఎమ్మిగనూర్ అంతర్రాష్ట్ర రహదారులతోపాటు ఉత్తనూర్-సింధనూర్, అయిజ-తూంకుంట, అయిజ-చిన్నతాండ్రపాడు రోడ్లపై వాగులు ఉధృతంగా పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అయిజ-పులికల్ రోడ్డులోని పోలోని వాగుపై డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయి, పొలాలు నీటి మునిగాయి. కంది, పత్తి, వరి దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందారు. అయిజలో 13.33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 14 ఏండ్లల్లో ఎప్పడూ ఇంత వర్షం కురవలేదని మండల రైతులు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భూదాన్‌పోచంపల్లి నుంచి బీబీనగర్ వెళ్లే మార్గంలో రుద్రవెల్లి దగ్గర మూసీనది పొంగిపొర్లుతున్నది. రాకపోకలు బంద్ అయ్యాయి. యాదగిరిగుట్టలో 17 సెంటీమీటర్లు, భువనగిరిలో 13.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): వచ్చే ఐదు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 24 వరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, నారాయణపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.