Land Acquisition | వికారాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లాలో ఫార్మా విలేజ్ ప్రతిపాదన వెనక్కి తీసుకుంటూ సర్కారు జీవో ఇచ్చింది. కానీ రైతుల నుంచి భూములు సేకరించి తీరుతామని సీఎం రేవంత్రెడ్డి మహబూబ్నగర్ సభలో తేల్చిచెప్పిన నేపథ్యంలో అధికారులు ప్రజాభిప్రాయం లేకుండానే భూమలు స్వాధీనం చేసుకుంటున్నారు. సర్కారు దౌర్జనంగా వ్యవహరిస్తున్నదని, అధికారులు భయపెట్టి, బెదిరించి భూములు లాక్కుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రేవంత్రెడ్డి సర్కారు అభివృద్ధి ముసుగులో రైతుల జీవితాలను ఆగం చేస్తున్నదని మండిపడుతున్నారు.
పడగనీడలో పల్లెలు.. తల్లడిల్లుతున్న తండాలు
రైతుల ఆందోళనల తర్వాత ఫార్మా విలేజ్కు ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటును తెరమీదకు తీసుకువచ్చింది. 1278 ఎకరాల భూసేకరణ చేయాలని నిర్ణయించింది. హకీంపేట, లగచర్ల, పోలేపల్లి గ్రామాల్లో భూసేకరణఖు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు రైతుల అధికారులు 118 మంది రైతుల నుంచి 226 ఎకరాల స్వాధీనానికి అంగీకార పత్రాలు తీసుకున్నారు. ప్రభుత్వం అడ్డదారిలో భూసేకరణ చేస్తున్నదని గిరిజన, ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు. తిరగబడితే మళ్లీ ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతారో అనే భయంతోనే సంతకాలు చేయాల్సి వస్తున్నదని బాధిత రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.