హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : చావులో కూడా రేవంత్‌రెడ్డి ప్రభుత్వానిది అమానవీయ రాజకీయమే అని మరోసారి తేలిపోయింది. సిగాచి ఇండస్ట్రీ పేలుడు బాధిత కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం చెల్లిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన మోసపూరితమేనని రుజువైంది. బాధిత కార్మిక కుటుంబాలకు తాము రూ.42 లక్షల నష్టపరిహారమే ఇచ్చేందుకు ఒప్పందం జరిగిందని, అదికూడా కార్మికులకు రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్, కేంద్రం ప్రకటించిన నష్టపరిహారం అంతా కలుపుకొని ఆ మొత్తం ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నామని సిగాచి పరిశ్రమ యాజమాన్యం రహస్యం బయటపెట్టింది. ఇప్పటివరకు బాధితులకు వివిధ దఫాలుగా చెల్లించిన పరిహారం పోను మిగిలిన డబ్బును ఈ ఏడాది మార్చి 31వ తేదీతో పోస్ట్ డేటెడ్ చెక్కులను జారీచేసింది. ఈ మేరకు 2025 డిసెంబర్ 26న మొత్తం 54 మంది బాధితుల చెక్కులను సంగారెడ్డి జిల్లా లేబర్ డిపార్టుమెంట్ డిప్యూటీ కమిషనర్‌కు అప్పగించారు. బాధిత కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనతో తమకు సంబంధం లేదని సిగాచి ఇండస్ట్రీ యాజమాన్యం రాష్ట్ర పరిశ్రమల శాఖకు నివేదించింది. ఈ అంశాన్ని హైకోర్టులో తెలిపింది.
నిరుడు జూలై 30న సంగారెడ్డి జిల్లా, పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి కెమికల్ ఇండస్ట్రీలో ఘోర ప్రమాదం జరిగి 56 మంది కార్మికులు చనిపోయారు. ఇందులో 46 మంది మృతదేహాలు, అవశేషాలు దొరకగా, మరో 8 మంది ఆనవాళ్లు లభించలేదు. జూలై 1న ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. రూ.కోటి పరిహారం ప్రభుత్వం ఇస్తుందా? కంపెనీ ఇస్తుందా? అని విలేకరులు ప్రశ్నించారు. దీనికి ముఖం చిట్లించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ఎవరు ఇస్తే ఏమిటి? బాధితులకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా అందుతుందని చెప్పారు. మళ్లీ బాధితుల దిక్కు చూడలేదు. బాధిత కుటుంబ సభ్యులు లేబర్ ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతున్నారు. కోటి పరిహారం ఎలా ఇస్తారంటూ అధికారులు హేళనగా మాట్లాడుతున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కూడా పరిహాసానికి గురవడం దారుణమని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
సిగాచి కంపెనీ యాజమాన్యం గత నెల 26న కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌కు ఒక లేఖ రాసింది. ఘటన జరిగిన మరుసటి రోజు కంపెనీ యాజమాన్యం సంబంధిత అధికారులతో చర్చలు జరిపి, మృతుల కుటుంబాలకు రూ.42 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఒక ఒప్పందం చేసుకున్నట్టు పేర్కొన్నది. ఆ ఒప్పందం ప్రకారం, ఈఎస్ఐ చట్టం పరిధిలోకి వచ్చినా రాకపోయినా, మరణించిన ప్రతి కార్మికుడికీ ఉద్యోగుల పరిహారం, భవిష్య నిధి ప్రయోజనాలు, బీమా మొత్తం, అంత్యక్రియల ఖర్చులు సహా రూ.42 లక్షలు చెల్లించడానికి అంగీకరించినట్టు వివరించింది. ఇప్పటివరకు ప్రతి కుటుంబానికీ నాలుగు, ఐదు వాయిదాల్లో సగటున రూ.25 లక్షలు నుంచి రూ.30 లక్షల వరకు చెల్లించినట్టు తెలిపింది. మిగిలిన డబ్బును వచ్చే మార్చి 31న చెల్లించేలా పోస్ట్-డేటెడ్ చెకులను ప్రతి బాధిత కుటుంబం పేరిట జారీచేశారు. సీఎం ప్రకటించిన మేరకు మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని హైకోర్టుకు చెప్పింది.
సిగాచి కంపెనీ ఒప్పంద పత్రం రాసుకున్నామని చెప్తున్న రోజునే సీఎం రేవంత్‌రెడ్డి పాశమైలారంలోని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడే అధికారులతో భేటీ అయ్యారు. ప్రమాదం జరిగి 24 గంటలు అవుతున్నా.. కంపెనీ ప్రతినిధులు అందుబాటులోకి రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు రూ. కోటి పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. కంపెనీ ప్రతినిధులు అందుబాటులో లేనప్పుడు కార్మికులకు వర్తించే బెనిఫిట్స్, నష్టపరిహారం మొత్తం కలిపి రూ.42 లక్షలకే ఫిక్స్ చేస్తూ.. కంపెనీ జారీచేసిన పోస్టు డేటెడ్ చెక్కులను లేబర్ కమిషన్ నిరభ్యంతరంగా స్వీకరించటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ లెక్కన రూ.42 లక్షల ఎక్స్‌గ్రేషియాకు లోపల ఒప్పుకున్న రేవంత్‌రెడ్డి బయటికి వచ్చి మాత్రం రూ.కోటి అని ప్రకటించినట్టు తెలుస్తున్నది.
జూన్ 30న ప్రమాదం జరిగితే, అక్టోబర్ వరకు బాధిత కుటుంబాలకు కనీసం పరిహారం ఇవ్వలేదు. దీనిపై సీఎం.. జిల్లా కలెక్టర్తోగాని, లేబర్ కమిషనర్‌తో గానీ కనీసం రివ్యూ సమావేశం పెట్టలేదు. పైగా ఘటన జరిగిన కొద్దిరోజులకే రాష్ట్ర కార్మికశాఖ అధికారులు కంపెనీ యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ వచ్చారు. కనబడకుండాపోయిన కార్మికులకు పరిహారం ఎగ్గొట్టటానికి కంపెనీ యాజమాన్యం తెరవెనుక ప్రయత్నాలు మొదలుపెట్టింది. కంపెనీలో వాళ్ల మస్టర్ లేదని, అటెండెన్స్ లేదని పేచీలు పెట్టింది. కార్మిక చట్టాల ప్రకారం ఏడేండ్ల తరువాత మిస్సింగ్ కార్మికులపై నిర్ధారణకు వస్తామని కానూన్ చదివింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు బాధితుల పక్షాన నిలబడ్డారు. బాధిత కుటుంబాల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగడుతూ నవంబర్ 20న సీఎం రేవంత్‌రెడ్డికే లేఖ రాశారు. బాధితులతో కలిసి ఆందోళన చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖను కలిసి సంప్రదింపులు జరిపారు. 8 మంది కార్మికులది మిస్సింగ్ కేసుగా కాకుండా, మరణాలుగా ధ్రువీకరించాలని అభ్యర్థించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో గత నెలలో కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.