Harish Rao | సంగారెడ్డి : జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని న్యాల్కల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేసి పాలలాంటి మంజీరా నీళ్లల్లో విషపు చుక్కలు కలుపుతావా..? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. న్యాల్కల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో హరీశ్ రావు పాల్గొని ప్రసంగించారు.
న్యాల్కల్లో ఫార్మా సిటీ పేరిట 2 వేల ఎకరాలు గుంజుకుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు అని హరీశ్‌రావు హెచ్చరించారు. జేసీబీ, పోక్లెయిన్ వస్తే మీ ఎమ్మెల్యే, నేను అడ్డం పడతాం. మా మీద ఎక్కినంకనే మీ వద్దకు అవి రావాలి. మీ కోసం గ్రీన్ ట్రిబ్యునల్, హై కోర్టులో కేసు వేస్తాం. ఇక్కడి భూమిని పొనివ్వం. ఒక్క మాట మీద ఉండండి. ఎవడు వస్తాడో చూస్తా, ఎట్లా వస్తారో చూస్తా అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
కోహీర్ జామకాయలు, డపూరు పుదీనాకు ఫేమస్.. ఇలాంటి భూములను నాశనం చేసే రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి. ఇక్కడి భూముల్లో ఫార్మా చిచ్చు పెట్టకు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల భూములు లాక్కోవడమా..? ఫార్మా సిటీ పెట్టి మంజీరను నాశనం చేస్తావా..? ఫార్మా సిటీతో ఇక్కడి నాలుగు వాగులు, పెద్ద వాగు, చెరువులు, మంజీర కలుషితం అవుతాయి. మెదక్, హైద్రాబాద్ ప్రజలకు కలుషిత నీరు అందిస్తారా? అని రేవంత్‌ను హరీశ్‌రావు నిలదీశారు.
భూములు లాక్కోనేందుకు చీకట్లో సంతకాలు పెట్టిస్తారు. జాగ్రత్తగా ఉండండి.. మోస పోకండి. ఎవరు ఏడవకండి మీకోసం మేము కొట్లాడుతం. మీరు ఐక్యంగా ఉండండి, మీకు అండగా ఉంటాం. రాళ్లు, రప్పలు ఉన్న భూముల్లో ఫ్యాక్టరీలు పెట్టండి. ఇక్కడ కాదు. నేను, మాణిక్ రావు ఇక్కడే ఉంటాం.. ఇక్కడే పడుకుంటాం జేసీబీలకు అడ్డంగా ఉంటాం. డూప్లికేట్ ఇందిరమ్మ రాజ్యం ఇది. సీఎం కావాలని అన్ని పార్టీలు మారి కాంగ్రెస్‌లోకి జంప్ అయిండు. ఎవరన్నా వస్తే ఒక్క ఫోన్ చేయండి.. రెండు గంటల్లో వస్తాం. తాత తండ్రికి ఇచ్చిన భూమి మీరు మీ పిల్లలకు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గద్దలా తన్నుకుపోతా అంటే చూస్తూ ఊరుకోం అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి..
KTR | పడిపోతున్న ప్రభుత్వ ఆదాయం.. పరిపాలనా వైఫల్యానికి నిదర్శనం : కేటీఆర్