సిద్దిపేట, ఆగస్టు 21 : భూపరిహారం కోసం సిద్దిపేట కలెక్టరేట్‌కు వచ్చిన ఓ రైతు గుండెపోటుతో కన్నుమూశాడు. వివరాలిలా.. సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్‌కు చెందిన రైతు గుండాల బాలకిట్టు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అదనపు టీఎంసీ కోసం నిర్మిస్తున్న 100 మీటర్ల కెనాల్లో తనకున్న రెండున్నర ఎకరాల భూమి కోల్పోతున్నాడు. ఈ క్రమంలో అధికారులు సర్వే చేసి బాలకిట్టుకు చెందిన భూమిలో మా ర్కింగ్ చేశారు.
బాలకిట్టు తనకు భూపరిహారం చెల్లించాలని ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్‌ను కలిసి మొరపెట్టుకున్నాడు. తనకు రావాల్సిన పరిహారం చెక్కు ఇవ్వాలని గురువారం ఉదయం 10 గంటలకు సిద్దిపేట కలెక్టరేట్‌కు వచ్చాడు.
అప్పటి నుంచి కలెక్టరేట్లోనే ఉన్న బాలకిట్టు మూత్ర విసర్జనకు కలెక్టరేట్ ఆవరణలో పొదల వైపు వెళ్లి అక్కడే గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే రైతును అంబులెన్స్‌లో ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందాడు. తన రెండెకరాల భూమికి ఎకరాకు రూ. 14.50 లక్షల చొప్పున రూ.29 లక్షల పరిహారం కోసం కలెక్టరేట్‌కు వెళ్లాడు.