Prabhakar Rao | హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈ నెల 9వ తేదీన హైదరాబాద్‌కు రానున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చి సిట్ విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇవాళ సిట్ ముందు హాజరు కావాల్సింది.. కానీ ప్రభాకర్ రావుకు వన్ టైమ్ ఎంట్రీ ట్రావెలింగ్ పాస్ పోర్టు, వీసా అందలేదు. దీంతో ఆయన మన దేశానికి రావడానికి ఆలస్యమవుతున్నట్లు సమాచారం. అయితే 9వ తేదీన హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత 3 రోజుల్లో విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు ఓ రాజకీయ కక్ష సాధింపు అని, అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి ఈ కేసును వెంటాడుతున్నారని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు తరఫు న్యాయవాదులు మే 29వ తేదీన సుప్రీంకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రభాకర్‌రావుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మే 29న విచారణ జరిగింది.
జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్‌చంద్రశర్మతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట పిటిషనర్ తరఫున దామా శేషాద్రినాయుడు, తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. తొలుత శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ ప్రభాకర్‌రావు పోలీసు శాఖలో 30 ఏండ్లకు పైగా సేవలందించారని, క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లారని చెప్పారు. అకడికి వెళ్లగానే ఆయనపై కేసు నమోదు చేశారని, పాస్‌పోర్ట్ కూడా రద్దు చేశారని తెలిపారు. మొదట ఆయనను దేశానికి రానిద్దామని, విచారణకు సహకరించకపోతే అప్పుడు చర్యలు తీసుకుందామని గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. మరి ప్రభాకర్‌రావు భారతదేశానికి వచ్చారా? అని జస్టిస్ నాగరత్న ప్రశ్నించగా, పాస్‌పోర్ట్ రద్దు చేసినందున ఆయన రాలేకపోతున్నారని శేషాద్రినాయుడు తెలిపారు.
కోర్టు అనుమతిస్తే ప్రభాకర్‌రావు మన దేశానికి వచ్చేందుకు, విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని శేషాద్రినాయుడు తెలిపారు. ఈ కేసులో ఎంతమందికి ముందస్తు, రెగ్యులర్ బెయిల్ వచ్చిందని జస్టిస్ నాగరత్న ప్రశ్నించగా.. ఒకరికి ముందస్తు, నలుగురికి రెగ్యులర్ బెయిల్ వచ్చిందని బదులిచ్చారు. ప్రభాకర్ రావు మాదిరిగానే ఇదే కేసులో ఆరోపణలు ఎదురొంటున్న శ్రవణ్‌కుమార్‌రావుకు అమెరికా నుంచి వచ్చేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపేనని తెలిపారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంతో సీరియస్ కేసని, దీన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. మిగిలిన నిందితులను ప్రభాకర్‌రావును ఒకేలా చూడొద్దని తెలిపారు.
మూడురోజులు సమయం ఇస్తే, చట్ట ప్రకారం ప్రభాకర్‌రావును భారత్‌కు తీసుకొస్తామని తుషార్ మెహతా తెలిపారు. దేశానికి వస్తే ఆయనను అరెస్టు చేస్తారా? అని ధర్మాసనం ప్రశ్నించగా, అవునని మెహతా బదులిచ్చారు. సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. లావేశ్ వర్సెస్ స్టేట్ (ఎన్సీటీ ఆఫ్ ఢిల్లీ), (2012) తీర్పును ప్రస్తావించారు. ప్రభాకర్‌రావుకు మందుస్తు బెయిల్ ఇవ్వకూడదని అన్నారు. దీనిపై జస్టిస్ నాగరత్న స్పందిస్తూ.. ‘ఒకవైపు మీరు పాస్‌పోర్టు రద్దు చేయించారు. అతడు ఒక ప్రకటిత నేరస్తుడని అంటున్నారు. మరోవైపు.. అతడు దేశానికి తిరిగిరావడం లేదని చెప్తున్నారు. ముందయితే.. ఆయన్ని మనదేశానికి రానివ్వండి. దర్యాప్తును జరగనివ్వండి’ అని వ్యాఖ్యానించారు. ‘ప్రభాకర్‌రావుకు భారతదేశానికి మాత్రమే ప్రయాణించడానికి పాస్‌పోర్ట్ లేదా ప్రయాణ పత్రాన్ని అందించండి. అది అందిన మూడు రోజుల్లోపు ఆయన దేశానికి తిరిగి వస్తానని, దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరవుతానని కోర్టుకు ప్రమాణపత్రం అందజేయాలి. మధ్యంతర రక్షణను అలుసుగా తీసుకోవద్దు. విచారణకు అన్ని విధాలా సహకరించాలి. తదుపరి విచారణ వరకు పోలీసులు ప్రభాకర్‌రావుపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దు. దర్యాప్తు స్థితి నివేదికను తదుపరి విచారణ రోజును దర్యాప్తు అధికారి సమర్పించాలి’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేరొంది. తదుపరి విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది.