చెరువుల్లో అక్రమ నిర్మాణాలంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్న ‘హైడ్రా’ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇతర ప్రభుత్వ శాఖల అనుమతులతో జరిపిన నిర్మాణాలకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఎలా కూల్చుతారని ప్రశ్నించింది. ఆయా నిర్మాణదారులకు నోటీసులు ఇవ్వకుండా, వారి నుంచి వివరణ తీసుకోకుండా కూల్చివేత చర్యలకు పాల్పడటాన్ని ఏవిధంగా సమర్థించుకుంటారని నిలదీసింది.
High Court | హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ‘కోర్టుల్లో ఒకటి చెప్తూ బయట మరోలా వ్యవహరిస్తారా?’ అంటూ నిప్పులు చెరిగింది. హైడ్రా దూకుడుగా వ్యవహరించడం సబబు కాదని, ఆ నిర్మాణాలు చట్టవిరుద్ధమైనవే అయినప్పటికీ కూల్చివేత చర్యలు మాత్రం చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. జీవో 99 చట్టపరిధిపై వివరణ ఇవ్వాలని, సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హైడ్రాను ఏర్పాటుకు సంబంధించిన జీవో 99 చట్టబద్ధతను సవాల్ చేస్తూ హైదరాబాద్ నానక్ రాంగూడకు చెందిన డీ లక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్‌లోని 119/21, 1199/22 సర్వే నంబర్లలో ఉన్న భూముల్లో హైడ్రా జోక్యాన్ని నిరోధిస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. కూలీల విశ్రాంతి కోసం నిర్మించుకున్న నిర్మాణాలను ఈ నెల 3న హైడ్రా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చివేసిందని తప్పుపట్టారు. ఆ రోజు ఉదయం హైడ్రా అధికారులు పోలీసు బలగాలతో వచ్చి కూల్చివేత చర్యలు చేపట్టడం చట్ట వ్యతిరేకమని, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా కూల్చివేతలు చేపట్టారని వివరించారు.
పరిపాలన పరమైన చర్యల్లో భాగంగా ప్రభుత్వం జీవో 99ని తీసుకొచ్చిందని తెలిపారు. చట్టాలకు లోబడే ఆ జీవో ఉండాలని, చట్టాలకు విరుద్ధంగా ఇచ్చే జీవోలు చెల్లవని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ అధికారాలను జీవో 99 ద్వారా హైడ్రాకు అప్పగించారని, ఇది జీహెచ్ఎంసీ చట్టానికి విరుద్ధమని వివరించారు. ఒక చట్టం కింద ఏర్పాటైన సంస్థ అధికారాలను మరో సంస్థకు బదలాయించాలంటే చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందని, అలాంటిదేమీ లేకుండా జీహెచ్ఎంసీ అధికారాలను హైడ్రాకు బదిలీ చేయడం చెల్లదని పేర్కొంటూ.. ప్రభుత్వం ఏ చట్టం కింద హైడ్రాకు అపరిమిత అధికారాలను అప్పగించిందో తెలియడంలేదని చెప్పారు. కార్యదర్శి లేదా అంతకంటే ఉన్నత హోదాలో ఉన్న అఖిల భారత సర్వీసు అధికారి హైడ్రాకు నేతృత్వం వహిస్తారని జీవోలో పేరొన్నప్పటికీ అందుకు విరుద్ధంగా బాధ్యతలు అప్పగించారని తప్పుపట్టారు. దీంతో హైడ్రా ఏర్పాటులో చట్టబద్ధత లోపించినట్టు హైకోర్టు అభిప్రాయపడింది. కానీ, జీవో 99 అమలుపై స్టే విధించేందుకు నిరాకరించింది. జీహెచ్ఎంసీ అధికారాలను హైడ్రాకు ఎలా బదిలీ చేశారో చెప్పాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హైడ్రా ఏర్పాటుతోపాటు దాని చట్టబద్ధత, విధులు, బాధ్యతలపై సమగ్ర వివరాలను అందజేయాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని 3 ఎకరాల వ్యవసాయ భూమిలో నిర్మించిన షెడ్, కాంపౌండ్ వాల్‌ను హైడ్రా కూల్చివేయచేయడాన్ని సవాలు చేస్తూ ఏపీకి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి భార్య ఉమామహేశ్వరమ్మ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై జస్టిస్ టీ వినోద్‌కుమార్ శుక్రవారం విచారణ జరిపారు. పట్టా భూమిలోని ప్రహరీ గోడ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంటూ ఈ నెల 8న హైడ్రా కూల్చివేసిందని, అది ఎఫ్టీఎల్ పరిధిలో లేదని స్పష్టం చేస్తూ గతంలో ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నివేదికను హైడ్రా అధికారులు పట్టించుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వివరించారు. ఆ చెరువుకు సంబంధించిన 1970 నాటి మ్యాప్‌ను సమర్పించడంతోపాటు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబరు 3కు వాయిదా వేశారు.