హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు అవసరమైన స్థాయిలో మందులు అందడం లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆరోపించారు. కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకూ అవసరమైన కొన్ని మందులు లభించడం లేదన్నారు. సోమవారం మండలిలో జీరో అవర్లో ఆయన మాట్లాడుతూ.. ‘మనిషి జీవితానికి ఒకప్పుడు కూడు, గూడు, గుడ్డ అవసరమయ్యేవి. ప్రస్తుతం వీటికి తోడు వైద్యం కూడా అత్యవసరంగా మారింది. నిత్య జీవితంలో ప్రజల వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. దవాఖానల్లో రోగుల సంఖ్య పెరిగింది. సామాన్యులకు అవసరమైన వైద్యం అందించాలి’ అని సూచించారు. కేసీఆర్ హయాంలో పేదలకు అవసరమైన వైద్యం అందించేందుకు ఆరు సూపర్ స్పెషాలిటీ దవాఖానల ఏర్పాటుకు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించారని గుర్తుచేశారు. ఇటీవల వీటి నిర్మాణపనులు ఆలస్యమవుతున్నాయని, వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన పనులు మందకోడిగా సాగుతున్నాయని తెలిపారు.