రేవంత్ ప్రభుత్వంలో సామాన్యుడి ఇండ్లకు పూచీ లేదు. ఏ క్షణంలో సర్కార్ ఏ సాకు చూపించి ఇంటిని నేలమట్టం చేస్తుందోనని భయాందోళన. ఇదే పాలనలో ఇప్పుడు ప్రభుత్వ భూములకూ రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వంలో ‘నంబర్ 2’గా చెప్పుకొనే ఓ మంత్రి, ‘ముఖ్య’నేత సోదరులతో ఏర్పడిన ‘బిగ్’ టీమ్.. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా రూ.5,800 కోట్ల విలువైన సర్కార్ భూములను పొతం పెట్టేందుకు పూనుకొన్నది. హైదరాబాద్ నగర శివారులోని బాలాపూర్‌లో 373.22 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేసింది. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలం నాదర్గుల్లోని శివరాజ్ బహదూర్ ఇలాకా భూములను కొల్లగొట్టేందుకు ‘బిగ్’ టీమ్ స్కెచ్ వేసింది. మూడు కంపెనీలను ముందుపెట్టి, వందల ఎకరాలను కబ్జా చేసింది. చుట్టూ ప్రహరీ కట్టి, భారీ నిర్మాణాలను చేపట్టింది. రైతులను పొలాలకు వెళ్లనివ్వరు. రెవెన్యూ, పోలీసు అధికారులను అటు చూడనివ్వరు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ‘ఆపరేషన్ ఆక్రమణ’ సాగుతుంటే.. పట్టించుకునే నాథుడెవరు?
రేవంత్ ప్రభుత్వ హయాంలో మరో భూఆక్రమణ కుట్రలు బయటపడ్డాయి. సాధారణంగా న్యాయ స్థానాల నుంచి ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా తీర్పులు వస్తే వాటిని రెవెన్యూ శాఖకు సమర్పించి… అందుకు అనుగుణంగా రికార్డుల్లో తమ పేర్లను నమోదు (మ్యుటేషన్) చేయించుకుంటారు.
ఆపై పాసు పుస్తకాలు పొంది అక్కడి నుంచి భూముల్ని అధికారికంగా స్వాధీనం చేసుకుంటారు. కానీ రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్లోని సర్వేనంబరు 613 కథ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నది. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ నిషేధిత జాబితాలో చేర్చిన భూముల్లో ఓ నిర్మాణ సంస్థ దర్జాగా పాగా వేసింది. అందులో ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న రైతుల్ని తన్ని తరిమేసింది. అధికారులు వెళ్లినా బౌన్సర్లతో అడ్డుకొంటున్నది. అనుమతులు లేకపోయినా శాశ్వత ప్రహరీ నిర్మాణాన్ని చేపడుతూ ఓ ప్రత్యేక సామ్రాజ్యాన్నే నిర్మించుకొంటున్నది. ఇదేదో మారుమూల ప్రాంతాల్లోనూ కాదు… ఎకరా రూ.16 కోట్లకుపైగా ధర పలికే హైదరాబాద్ నగరంలోనే ఈ దౌర్జన్య కాండ కొనసాగుతున్నది.
ఒకవైపు సుప్రీంకోర్టులో ఇది ప్రభుత్వ భూమి అంటూ కౌంటర్ అఫిడవిట్ వేసి… ఈ క్షణానికి సైతం అవి ప్రభుత్వ భూములే అని చెబుతున్న జిల్లా కలెక్టర్ మొదలు స్థానిక తాసిల్దార్ వరకు దీనిపై ఎవరూ నోరు మెదపరు. కారణం తెర వెనుక సర్కార్ పెద్దల మౌఖిక ఆదేశాలు! ఇప్పుడు ప్రహరీ… ఆపై రాత్రికి రాత్రి రికార్డుల తారుమారు! అంటే కండ్ల ముందు రూ.6000 కోట్ల ప్రభుత్వ భూములు హాంఫట్ అన్నమాట!!

హైదరాబాద్, మార్చి 27 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం (గతంలో సరూర్‌నగర్ మండలం)లోని సర్వేనంబరు 613లో (పాత సర్వేనంబరు 119) 373.22 ఎకరాల భూమి ఉంది. 1954-55 ఖాస్రా పహాణీలో దీనిని దస్తగర్దన్ భూమిగా పేర్కొంటూ పట్టాదారు కాలంలో శివరాజ్ ఇలాకాగా నమోదు చేశారు. 1961-62, 1963-64, 1965-66, 1972ల్లో 355.12 ఎకరాలు ప్రభుత్వ భూమి (సర్కారీ)గా నమోదవుతూ వస్తున్నది. భూ రికార్డుల నవీకరణ (ఎల్‌ఆర్‌యూపీ)లో పాత సర్వేనంబరు 1-119, కొత్త సర్వేనంబరు 613లో తిరిగి 373.22 ఎకరాల భూమిని నమోదు చేస్తూ… దానిని ‘కంచ సర్కారీ’గా పొందుపరిచారు.
ఈ క్షణం వరకు కూడా ప్రభుత్వ రికార్డుల్లో ఈ భూములు నిషేధిత జాబితాలో పొందుపరిచి ప్రభుత్వ భూములుగానే కొనసాగుతున్నాయి. ఈ 373.22 ఎకరాల్లో దాదాపు 143 మంది రైతులు 70 ఏండ్లుగా సాగు చేసుకుంటున్నట్లు రెవెన్యూ అధికారులే గతంలో (ప్రొటెక్టెడ్ టెనెంట్స్) నిర్ధారించడంతో పాటు కరెంటు కనెక్షన్లు ఇవ్వాలని గతంలో లేఖలు కూడా రాశారు. ఈ భూమిలోని బావులు, బోర్ల కింద వరి, ఆకుకూరలను రైతులు పండిస్తున్నారు. కొంతమంది రైతులు ఇప్పటికీ ఇక్కడ డెయిరీ ఫామ్‌లు నడిపిస్తున్నారు.

కోట్లలో విలువ చేసే ఈ భూములపై అనేక మంది కన్నేశారు. ఇందులో భాగంగా మాజీ ఎంపీ, ఓ పత్రికాధినేత 613 సర్వే భూములతో సహా శివరాజ్ బహదూర్‌కు చెందిన మరికొన్ని భూములను కొనుగోలు చేసినట్టుగా డాక్యుమెంట్లు సృష్టించారు. ఆ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసి వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. ఆ డాక్యుమెంట్లను చార్మినార్ బ్యాంకులో కుదువ పెట్టి కోట్లాది రూపాయల రుణాలు తీసుకున్నారు. దీంతో తాము ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్ని మాజీ ఎంపీ కబ్జాలోకి తీసుకోవడంపై ఆగ్రహించిన నాదర్గుల్ రైతులు చైతన్యవంతులై 2007లో పెద్ద ఎత్తున ఆ ఫాంహౌజ్‌పై దాడులు చేసి ఫెన్సింగ్, ఇతరత్రా నిర్మాణాల్ని ధ్వంసం చేశారు. ఈ క్రమంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఈ భూముల దగ్గరికి వచ్చి పరిశీలించి… 2007, మార్చి 14న అప్పటి సీఎం వైఎస్‌కు లేఖ రాశారు.
జాగీర్లు రద్దు కావడంతో ఆ భూములు ప్రభుత్వానికి దఖలు పడటంతో పాటు శివరాజ్ బహదూర్ వారసులు ఆ మేరకు పరిహారం కూడా తీసుకున్నారని.. ఈ నేపథ్యంలో రైతులకు ఆ భూముల్ని దక్కేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. అనంతరం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని ఖాళీగా ఉన్న 613 సర్వేనంబరులోని 373.22 ఎకరాలను ఏపీఐఐసీకి అప్పగిస్తూ 2007, మే 8న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత ఏపీఐఐసీ ఈ భూముల్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో దశాబ్దాల నుంచి సాగు చేసుకుంటున్న రైతులు అదేరీతిన వ్యవసాయాన్ని కొనసాగించారు. ఆ తర్వాత 2022లో మరోసారి కొందరు వ్యక్తులు న్యాయస్థానం ఉత్తర్వులు ఉన్నాయంటూ 613 సర్వేనంబరు చుట్టూ ప్రహరీ వేసేందుకు ప్రయత్నాలు చేస్తే నాదర్గుల్ రైతులు ఆ ప్రయత్నాలనూ తిప్పికొట్టారు.

నాదర్గుల్ సర్వేనంబరు 613కు సంబంధించి ఎక్కడా శివరాజ్ బహదూర్ వారసుల పేర్లు రికార్డుల్లో నమోదు కాలేదు. కనీసం పలానా వాళ్లు వారసులు అంటూ ధృవీకరణ పత్రాలు కూడా లేవు. అయినప్పటికీ 2005లో ప్రతాప్ కరణ్‌తో పాటు 15 మంది తాము శివరాజ్ బహదూర్ ఇలాకా వారసులమంటూ రంగారెడ్డి జిల్లా కోర్టులో సివిల్ దావా (ఓఎస్ నెంబరు 155/2005) దాఖలు చేయగా… 2007లో కోర్టు దావాను కొట్టివేసింది. దీంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2007, మే 8న 373.22 ఎకరాలను హార్డ్‌వేర్ పార్కును అభివృద్ధి చేసేందుకు ఏపీఐఐసీకి స్వాధీనం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
అయితే ఒకవైపు కేసు కోర్టులో ఉండగానే సదరు వారసులం అని కోర్టును ఆశ్రయించిన వారు భూ సంస్కరణల చట్టం-1974 కింద ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వకుండా… కనీసం రెవెన్యూ రికార్డుల్లో సదరు సర్వేనెంబరులో వారి పేర్లు నమోదు కాకుండానే పది మంది వారసులు 2006లో కరీం అల్లావుద్దీన్ అనే వ్యక్తికి 266.19 ఎకరాల మేర ఏజీపీఏ చేశారు. వాస్తవానికి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అప్పుడే ఆధారాలు లేవంటూ తిరస్కరించాలి. కానీ ఇక్కడే వాళ్ల అవినీతిని ఆసరాగా చేసుకొని ఏజీపీఏ ప్రక్రియ పూర్తి చేశారు. వాటి ఆధారంగా సదరు వారసులు 2007లో అదే కోర్టులో మరోసారి అప్పీలు చేయగా… చివరకు మూడో జడ్జి వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. వారసులు డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరంలేదని, రికార్డుల్లో వారి పేర్లను చేర్చవచ్చని అందులో పేర్కొన్నారు. దీనిపై ఏపీఐఐసీ 2013లో మరో రెండు సివిల్ అప్పీల్స్ ద్వారా సుప్రీం కోర్టును ఆశ్రయించగా… వాటిని న్యాయస్థానం 2015లో తిరస్కరించింది.
ఆ వెంటనే 2006లో ఏజీపీఏ చేయించుకున్న కరీం అల్లావుద్దీన్ 50 ఎకరాల చొప్పున మూడు కంపెనీలకు 150 ఎకరాల మేర 2016లో సేల్‌డీడ్ చేశారు. యునైటెడ్ ల్యాండ్ మార్క్స్ ప్రైవేటు లిమిటెడ్, ఆల్ఫా ఎస్టేట్ హోల్డింగ్స్, ఒమేగా డెవలప్మెంట్… ఈ మూడు కంపెనీలకు పీవీ నర్సింహారావు అనే వ్యక్తి డైరెక్టర్‌గా ఉన్నారు. వెంటనే ఆ మూడు కంపెనీలు 2016లో మ్యుటేషన్ (భూ రికార్డుల్లో తమ పేర్ల నమోదు) ద్వారా యాజమాన్య హక్కులు పొందేందుకు సరూర్‌నగర్ తాసిల్దార్‌కు దరఖాస్తు చేసుకోగా ఆయన మ్యుటేషన్ ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ఈ రోజు వరకు కూడా ఆ ఉత్తర్వులు అమలు కాలేదు. అనంతరం కంపెనీలు కందుకూరు ఆర్డీవోకు నాలా (వ్యవసాయేతర భూమిగా మార్పు) కోసం దరఖాస్తు చేసుకున్నారు.
అయితే ఆ భూములు నిషేధిత జాబితాలో ఉన్నందున ఆర్డీవో వాటిని 2019లో తిరస్కరించారు. దీంతో ఆ కంపెనీలు ఆర్డీవో తిరస్కరణ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాయి. చివరకు 2020లో హైకోర్టు తిరస్కరిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. దరఖాస్తుదారుల ఒత్తిడి, 2007లో జిల్లా కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించాననే కేసును ఎదుర్కొనకుండా ఉండేందుకే సరూర్‌నగర్ తాసిల్దార్ మ్యుటేషన్ ఉత్తర్వులు ఇచ్చారని హైకోర్టు పేర్కొంది. నాలా ఉత్తర్వుల్ని తిరస్కరించిన కందుకూరు ఆర్డీవో నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది. హైకోర్టు తీర్పుపై కంపెనీ ప్రతినిధులు సుప్రీం కోర్టుకు అప్పీలుకు వెళ్లారు.
ప్రస్తుతం కేసు కొనసాగుతున్నది. కాగా, శివరాజ్ బహదూర్ వారసులు కొందరు 2006లో కరీం అల్లావుద్దీన్ అనే వ్యక్తికి 266.19 ఎకరాల మేర చేసిన ఏజీపీఏను రద్దు చేయాలంటూ రంగారెడ్డి కోర్టులో 963/2021, హైకోర్టులో 606/2022 పిటిషన్లు దాఖలయ్యాయి. అంటే సదరు కరీం అల్లావుద్దీన్కు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ద్వారా బదిలీ అయిన భూమి వ్యవహారమే ప్రశ్నార్థకంగా మారిందన్న మాట. పూర్వ భూహక్కులే ప్రశ్నార్థకంగా మారాయంటే.. ఆపై మూడు కంపెనీలకు బదలాయించిన భూ డాక్యుమెంట్లకు సార్థకత ఏముంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
సర్వేనంబరు 613లోని 373.22 ఎకరాలు ప్రభుత్వ భూములే, నిషేధిత జాబితాలో ఉన్నాయని బాలాపూర్ తాసిల్దార్ ఇందిరాదేవి చెప్పారు. ప్రహరీ నిర్మాణం జరుగుతుందని సమాచారం అందడంతో గతంలో తాను అక్కడికి వెళ్లానని, కానీ అక్కడ ఉన్న బౌన్సర్లు గేటు దాటి లోపలికి పోనీయడం లేదని చెప్పడం గమనార్హం. దీంతో అక్కడి నుంచే ఆదిభట్ల పోలీసులకు ఫోన్ చేసినా వాళ్లు రక్షణ ఇవ్వకపోవడంతో వెనుదిరిగి వచ్చానన్నారు.
ఈ భూముల అంశంపై ‘నమస్తే తెలంగాణ’ కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డిని సంప్రదించగా… అవి ప్రభుత్వ భూములేనని స్పష్టం చేశారు. ‘ఈ మేరకు సుప్రీం కోర్టులో కేసు కొనసాగుతుంది. ప్రభుత్వం తరపున కౌంటర్ అఫిడవిట్ కూడా వేశాం. అయితే ఓ నిర్మాణ సంస్థ ప్రహరీ నిర్మాణం చేపడుతుంటే ఆ పనుల్ని నిలిపివేసినం కదా!’ అని అన్నారు. వాస్తవానికి పనులు ఆగకుండా ప్రహరీ పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పగా తాసిల్దార్‌తో మాట్లాడుతానని అన్నారు. కాగా ఈ భూముల అంశంపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని సంప్రదించేందుకు ‘నమస్తే తెలంగాణ’ ప్రయత్నించింది. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు.
సదరు నిర్మాణ సంస్థ ప్రభుత్వ పెద్దల సహకారంతో దౌర్జన్యంగా, అనుమతులు లేకుండా 613 సర్వేనంబరులోని 373.22 ఎకరాల చుట్టూ రేకుల ప్రహరీతో పాటు ఇప్పుడు ఏకంగా శాశ్వతంగా గోడ నిర్మిస్తున్నది. ఇదేమంటే, తమకు న్యాయస్థానం నుంచి ఉత్తర్వులు ఉన్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో గతంలోని కోర్టు ఉత్తర్వులు, ఇష్టానుసారంగా శివరాజ్ బహదూర్ వారసులు చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు… వేల పేజీలను బుక్లెట్లుగా చేసి అధికారులకు ఇస్తున్నారు. అంటే ఇన్ని డాక్యుమెంట్లు ఉన్నాయా? అని అందరూ విస్మయం వ్యక్తం చేసి మిన్నకుంటారనేది సదరు నిర్మాణ కంపెనీ, తెర వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దల మైండ్‌గేమ్. కానీ లక్షల కొద్దీ డాక్యుమెంట్లు ఉన్నా… రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ఆధారంగా మ్యుటేషన్ చేయించుకోవాలి. అందుకోసం ముందుగా 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న సర్వేనెంబరు 613ను తొలగించాలి. కానీ ఇవేవీ చేయట్లేదంటే ఏదో దాస్తున్నట్టేగా?! ఇక, తాము సాగు చేసుకొంటున్న భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్టు అక్కడి రైతులు జిల్లా కలెక్టర్, కందుకూరు ఆర్డీవో, బాలాపూర్ తాసిల్దార్‌తో పాటు హైడ్రాకు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు.
రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాలుగా సామాన్యుడు ప్రభుత్వ భూమిలో గుంట జరిగితే బుల్డోజర్లు విరుచుకుపడుతుండటం నిత్యం చూస్తున్నాం. కానీ హైదరాబాద్ మహా నగర పరిధిలో ఎకరా రూ.16 కోట్లకు పైగా విలువ చేసే 373.22 ఎకరాల భూములు నిషేధిత జాబితాలో ఉన్నా.. నిర్మాణ కంపెనీ దౌర్జన్యంగా స్వాధీనం చేసుకొని, కొందరు రైతులతో అనధికారిక ఒప్పందాలు చేసుకుంటున్నా రెవిన్యూ శాఖ ప్రేక్షకపాత్ర పోషిస్తుంది. దీన్నిబట్టి తెర వెనుక ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన సంకేతాలున్నట్లు అర్థమవుతుంది. తమకు పోలీసు రక్షణ ఇవ్వకపోవడంతో ప్రహరీ నిర్మాణాల్ని నిలువరించలేకపోతున్నానని బాలాపూర్ తాసిల్దార్ చెబుతున్నారు. అసలు పోలీసు రక్షణ కావాలని తాసిల్దార్ తమకు లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వలేదని, ఇస్తే ఈ క్షణమైనా వస్తామని ఆదిభట్ల ఇన్స్పెక్టర్ చెబుతున్నారు. అంటే రెండు శాఖలు ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టుకుంటూ నిర్మాణ సంస్థకు మార్గం సుగమం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఓ నిర్మాణ సంస్థ రంగంలోకి దిగింది. దశాబ్దాల ఈ భూ వివాదాల వివరాల్ని పరిశీలిస్తే ఈ నిర్మాణ సంస్థకు ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేదు. కానీ శివరాజ్ బహదూర్ వారసుల నుంచి ఈ భూముల్ని కొనుగోలు చేసిన కంపెనీలు తమకు ఇచ్చాయంటూ ఈ కంపెనీ ఫీల్డ్‌లోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం 2023, డిసెంబరు 7న ఏర్పాటు కాగా… డిసెంబరు 18న రాచకొండ పోలీసుల సహకారంతో ఈ కంపెనీ భూములపైకి వచ్చి రేకుల ప్రహరీ ఏర్పాటు చేసింది. అయితే తమ భూముల్లోకి వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా… 30 మంది బౌన్సర్లను ఏర్పాటు చేసి అన్నదాతలను భయభ్రాంతులకు ఈ కంపెనీ ప్రతినిధులు గురి చేశారు. కాగా ఈ నిర్మాణ కంపెనీ డైరెక్టర్లు ఇతర అనేక కంపెనీల్లోనూ డైరెక్టర్లుగా ఉన్నారు. అయితే అందులో ఒక కంపెనీకి ప్రస్తుతం నంబర్ టూ అంటున్న మంత్రి కుమారుడు మాజీ అడిషనల్ డైరెక్టర్‌గా వ్యవహరించడం గమనార్హం. ఈ భూహాంఫట్ స్కామ్‌లో బిగ్ ముఠా హస్తం ఉందని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. కాగా మొత్తం 143 మంది రైతుల్లో చాలా మందిని ప్రలోభాలకు గురి చేయగా… మిగతా రైతులు మాత్రం భూముల్ని వదిలే ప్రసక్తేలేదని తేల్చి చెప్తున్నారు.
మా తాతలు, తండ్రుల నుంచి సాగు చేసుకుంటున్న పొలంలోకి రానీయడం లేదు. మేం నమ్ముకున్న భూమిని మా కండ్ల ముందే కంపెనోళ్లు గుంజుకున్నరు. మా పొలం మాకు దక్కకపోతే అందులోనే పురుగుల మందు తాగి చస్తం.
– కర్రె యాదయ్య, నాదర్గుల్ రైతు
ఇక్కడ నాకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. మా తాతల నుంచి అందులోనే వ్యవసాయం చేస్తున్నం. ఇప్పుడు ఓ కంపెనీ వచ్చి మమ్మల్ని అందులోకి పోనీయడం లేదు. ఇదేమంటే రౌడీలను పెట్టి బెదిరిస్తున్నారు. పోలీసులు పట్టించుకోవట్లేదు. పైగా 60 మంది రైతుల మీదనే కేసు పెట్టారు.
– గుడాల బాబు, నాదర్గుల్ రైతు

సర్వేనంబర్ 613లోని 373.22 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ రంగారెడ్డి కలెక్టర్ రిజిస్ట్రేషన్ శాఖకు పంపిన 22ఏ (నిషేధిత భూముల) జాబితా