హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో గులాబీ పార్టీ ప్రభంజనం సృష్టిస్తున్నది. తమ రాష్ట్రంలోనూ తెలంగాణ మాడల్‌ను అమలు చేయాలని రైతులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెల 5న నాందేడ్‌లో నిర్వహించిన సభతో ‘మహా’ సర్కారులో గుబులు మొదలైంది. బీఆర్ఎస్ దెబ్బకు మహారాష్ట్ర సర్కారు దిగొచ్చింది. రైతుబంధు తరహాలో రైతులకు ఏడాదికి ఎకరానికి రూ. 6 వేల పంటపెట్టుబడి సాయం అందిస్తామని ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించింది. నాందేడ్ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగం మహారాష్ట్ర బుద్ధిజీవులను తట్టిలేపింది. రాష్ట్రస్థాయి నుంచి తాలూకాస్థాయికి విస్తరించిన శంభాజీ బ్రిగేడ్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి, తాము బీఆర్ఎస్తో పనిచేస్తామని ప్రకటించారు.
నాందేడ్, ఔరంగాబాద్, షోలాపూర్, యావత్మాల్, రాజురా, చంద్రాపూర్ వంటి ప్రాంతాల నుంచి ప్రజలు.. ప్రత్యేకించి రైతులు, మహిళలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్తో కలిసి అడుగేస్తున్నారు. మహారాష్ట్ర రైతాంగం నుంచి వస్తున్న ఆదరణను గుర్తించిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ముందుగా పార్టీ రైతు విభాగాన్ని (బీఆర్ఎస్ కిసాన్ సెల్) ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా మాణిక్ కదంను నియమించారు. దీంతోపాటు మరో ఐదుగురిని ప్రాంతీయ కో-ఆర్డినేటర్లుగా ప్రకటించారు. మహారాష్ట్ర రైతాంగంలో పార్టీ కిసాన్ సెల్ విస్తృత కార్యాచరణను చేపట్టింది. గ్రామ గ్రామాన రైతు సమావేశాలు నిర్వహిస్తూ తెలంగాణ మాడల్ కావాలని మహారాష్ట్రవ్యాప్తంగా కార్యాచరణ రూపొందించింది.
ఫలితంగా ఆయా ప్రాంతాల నుంచి బీఆర్ఎస్లో చేరేందుకు మహారాష్ట్ర మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలుసహా ప్రస్తుత ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకీ సైతం ముందుకొచ్చారు. నాందేడ్ జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రాంతాల్లో స్వచ్ఛందంగా యువకులు కదిలివచ్చి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించుకొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్ర కిసాన్ సెల్ బహిరంగసభను నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్‌ను కోరింది. మహారాష్ట్ర రైతుల కోరిక మేరకు కంధార్-లోహలో బహిరంగ సభను నిర్వహించాలని మార్చి 15న సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. అప్పటి నుంచి కేవలం 11 రోజుల అనంతరం ఆదివారం బహిరంగ సభ నిర్వహించగా, మహారాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అంటూ నినదించారు.
బీఆర్ఎస్పై ‘మహా’ ఆసక్తి