Vijay | నటుడు, తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ చీఫ్ ఆదివారం అధికార పార్టీ డీఎంకేపై మండిపడ్డాడు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితాపై డీఎంకే ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని, ఈ అంశాన్ని ఎన్నికల ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కపట నాటకాలు ఆడుతోందని విమర్శించారు. ఈ అంశంపై ప్రజల హక్కులను కాపాడేందుకు ప్రతిపక్ష పార్టీలతో కలిసి రావడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని.. కానీ డీఎంకే ఉద్దేశంలో నిజాయితీ లేదన్నారు. కేరళ అసెంబ్లీ సర్కి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదిందని.. తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే ఎందుకు ఆ పని చేయలేదని నిలదీశారు.
తన పార్టీ మొదట సర్ని వ్యతికేరించిన సమయంలో డీఎంకే నిద్రలో ఉందని.. ఆ పార్టీకి బీజేపీతో పరోక్ష సంబంధాలు ఉన్నాయని.. అందుకే ఆ పార్టీ మౌనంగా ఉండిపోయిందని విమర్శించారు. డీఎంకే మిత్రపక్షాలను మోసం చేసిన విధంగానే ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని.. కానీ, కపట నాటకాన్ని ప్రజలంతా గమనించారన్నారు. సర్ గురించి అవగాహన కల్పించేందుకు తమ పార్టీ సెమినార్లు, ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తుందని టీవీకే చీఫ్ వెల్లడించారు. సర్ సందర్భంగా బిహార్లో లక్షలాది మంది ఓటర్ల పేర్లను తొలగించారని ఫిర్యాదులు వచ్చాయన్న విజయ్.. ఈ విషయం సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్లో ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తొలిదశలో జరిగిన అవకతవకలను సరిదిద్దకుండానే.. రెండోదశ ప్రక్రియ ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు.
తమిళనాడులో దాదాపు 63.6 మిలియన్ల మంది ఓటర్లు ఉన్నారని.. కేవలంలో 30 రోజుల్లోనే ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లను ఎలా ఆడిట్ చేయడం సాధ్యమవుతుందన్నారు. మైనారిటీ ఓట్లపైనే ప్రతిపక్ష పార్టీల ఆందోళన వ్యక్తం చేశాయని.. ఆందోళనపై ఎలాంటి నిర్దిష్ట హామీ ఇవ్వలేదని విజయ్ ఆరోపించారు. అసోంలో సర్ లేకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. రెండోదశ నుంచి అసోంను మినహాయించి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్లాన్ చేయడం అనుమానాలను మరింత పెంచాయన్నారు. ఈ గందరగోళంగా మారిన సర్ ప్రక్రియను వదిలేయాలని.. ఓటరు జాబితాను సరిదిద్దేందుకు పాత పద్ధతినే కొనసాగించాలని కోరారు.