Road Accident | జోధ్‌పూర్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 18 మంది దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును టెంపో ట్రావెల్ ఢీకొట్టింది. మృతులందరూ కోలాయత్ ఆలయాన్ని సందర్శించి జోధ్‌పూర్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా జోధ్‌పూర్‌లోని సుర్సాగర్ ప్రాంత వాసులుగా తెలుస్తున్నది. ఫలోడి పోలీస్ సూపరింటెండెంట్ కుందన్ కన్వారియా ప్రమాదాన్ని ధ్రువీకరించారు.
సమాచారం ప్రకారం.. రాజస్థాన్ ఫలోడి జిల్లాలోని మటోడా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ పెద్ద ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న ట్రక్కును టెంపో ట్రావెలర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 18 మంది మరణించారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులంతా కోలాయత్ ఆలయాన్ని సందర్శించి.. తిరిగి జోధ్‌పూర్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న జోధ్‌పూర్ సీపీ ఓం ప్రకాశ్ మధురదాస్ మాథుర్ ఎండీఎం ఆసుప్రతికి చేరుకున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వికాస్ రాజ్‌పురోహిత్‌తో క్షతగాత్రులకు చికిత్స ఏర్పాట్లపై సమీక్షించి.. పలు సూచనలు చేశారు.
ఫలోడి పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ అమనారామ్ మాట్లాడుతూ.. కోలాయత్ జాతరను సందర్శించడానికి వెళ్లారని.. తిరిగి వస్తుండగానే బస్సు టెంపోను ఢీకొట్టిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించి.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసి తన మనసుకు బాధ కలిగిందన్నారు. మృతుల కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని.. గాయపడిని వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.