KTR | పదేళ్లలో పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో పేద కుటుబాలకు అండగా నిలిచామని పేర్కొన్నారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు 24 గంటల కరెంటు ఇచ్చామని చెప్పారు. ఎన్నో నీటి పారుదల ప్రాజెక్టులు చేపట్టామన్నారు. బెంగళూరు లాంటి నగరాల్లో ఏడేళ్లు పట్టే ఫ్లైఓవర్లను మేం అతి తక్కువ కాలంలోనే పూర్తి చేశామని చెప్పారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా షేక్‌పేటలోని సత్వ గేటెడ్ కమ్యూనిటీలోని అపార్ట్మెంట్ వాసులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మీరు గూగుల్, చాట్ జీపీటీని ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని అడిగితే కాళేశ్వరం అని చెబుతాయని అన్నారు. అలాంటి ప్రాజెక్టును చేపట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని స్పష్టం చేవారు. వరల్డ్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ క్యాంపస్ అని అడిగితే టీ హబ్ అని చూపిస్తుందన్నారు. మేం దేశంతోనే కాదు.. ప్రపంచంతోనే పోటీ పడ్డామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలోనే దేశంలోనే అన్ని రాష్ట్రాలను అధిగమించి తలసరి ఆదాయం రూ.3.87 లక్షలకు చేరిందని తెలిపారు. మేం వచ్చిన తర్వాత కొత్తగా ఆరు లక్షల ఐటీ ఉద్యోగాలు తీసుకొచ్చామని పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా
షేక్ పేటలోని సత్వ గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ వాసులతో సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS🔹పదేళ్లలో పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం
🔹హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాం
🔹కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్… pic.twitter.com/Iw8U6pJr8j
— BRS Party (@BRSparty) November 2, 2025
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపినాథ్ అనారోగ్యంతో మృతిచెందడంతో జూబ్లీహిల్స్‌లో ఎన్నికలు వచ్చాయని కేటీఆర్ అన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని అమలు చేయట్లేదని తెలిపారు. ఈ ఒక్క సీటుతో వచ్చేది లేదు.. పోయేది లేదని అన్నారు. కానీ.. ఇక్కడ కాంగ్రెస్‌ను ఓడించి హామీలు అమలు చేయని ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని సూచించారు. నవంబర్ 11న బీఆర్ఎస్కు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
షేక్‌పేట్‌లో ఫ్లై ఓవర్ పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యను తీర్చామని కేటీఆర్ తెలిపారు. సిగ్నల్ ఫ్రీ సిటీగా చేయాలన్నదే మా టార్గెట్‌గా ఉండేదని పేర్కొన్నారు. మీలో ఒక్కరు వెళ్లి ఓటు వేయకపోయినా.. కాంగ్రెస్ దొంగ ఓటు వేసే ప్రమాదం ఉందని అన్నారు. రెండేళ్లలో ఏం చేయని కాంగ్రెస్ డబ్బులు ఇచ్చి ఓట్లు కొనాలనుకుంటోందని తెలిపారు. ఇక్కడ ఎవరైనా బెదిరింపులకు దిగితే మీకు అండగా మేం ఉంటామని స్పష్టం చేశారు. మీరు ఓటేసిన తర్వాత మీ వాట్సాప్ గ్రూప్‌లో ఫొటో పెట్టండని సూచించారు. ఓటు వేయకపోతే ప్రశ్నించే హక్కు కోల్పోతారని తెలిపారు.