హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): జనసమ్మర్ద ప్రాంతాల్లో, పండుగలు, జాతరలు, రద్దీ మార్కెట్లలో వెకిలి వేషాలు వేసే పోకిరీల భరతం పడుతున్నాయి షీ టీమ్స్. రాష్ట్రవ్యాప్తంగా షీ టీమ్స్ బృందాల సిబ్బంది మఫ్టీలో ఉంటూ గస్తీ కాస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ పరిధిలో జరిగిన బోనాల ఉత్సవాల్లో ఆకతాయిగా వ్యవహరించిన వారితో ఊచలు లెక్కపెట్టించారు.
ఇటీవల ముగిసిన ఉజ్జయిని మహంకాళీ బోనాల జాతర సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు వచ్చే మహిళా భక్తుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు వారికి తెలియకుండా ఫొటోలు తీసేందుకు ప్రయత్నించిన పోకిరీలను సాక్ష్యాధారాలతో పట్టుకొన్నారు. కోర్టుకు వాటిని సమర్పించి మొత్తం 8 మందిని జైలుకు పంపారు. మహిళల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ బృందాలు.. హిడెన్ కెమెరాలు, అత్యాధునిక కెమెరాలతో నిఘా పెట్టి సాక్ష్యాలు సేకరిస్తున్నాయి.