Harish Rao | హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): దళితబంధులాగే గిరిజనులకు గిరిజన బంధు ఇస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 4.50 లక్షల ఎకరాలకు పోడు పట్టాలిచ్చామని, మిగిలిన భూములకు కూడా పోడు పట్టాలిస్తామని తెలిపారు. శనివారం మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో బీఆర్ఎస్ గిరిజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌రావు మాట్లాడారు. తండాలు ఒకప్పుడు ఎట్లుండేవో, ఇప్పుడు ఎట్లున్నాయో అందరూ ఆలోచించాలని అన్నారు. పదేండ్ల క్రితం తండాల దుస్థితి తనకింకా గుర్తున్నదని చెప్పారు.
నారాయణఖేడ్, జోగిపేట, అందోల్ వంటి ఏరియాల్లో మూడు, నాలుగు కిలోమీటర్ల నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉండేదని గుర్తుచేశారు. నులకమంచంపై పిల్లలకు స్నానం చేయిస్తూ, కింద తాంబాళంలో నీళ్లు పట్టుకుని వాడుకునేంత దుర్భరమైన పరిస్థితులు ఉండేవని అన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు వచ్చి చేరాయని వెల్లడించారు. గిరిజన బిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. బంజారాహిల్స్‌లో గిరిజన ఆదివాసీ బిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలని బంజారా, ఆదివాసీ భవనాలను కట్టించామని తెలిపారు. విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు ఇచ్చామని వివరించారు. గూడేలకు, తండాలకు త్రీ ఫేజ్ కరెంట్ ఏర్పాటు చేశామని అన్నారు.
మాటతప్పిన కాంగ్రెస్.. కలలు నెరవేర్చిన కేసీఆర్
మాటతప్పిన కాంగ్రెస్ ఒకవైపు ఉన్నదని, కలలు నెరవేర్చిన కేసీఆర్ మరో వైపు ఉన్నారని.. మరి తండాలు ఎటువైపు ఉంటాయో ఆలోచించాలని హరీశ్‌రావు సూచించారు. తండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని 2009లో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందని, మరి చేసిందా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ 3,142 తండాలు, గూడేలను పంచాయతీలుగా చేశారని గుర్తు చేశారు. ఆనాడు తండాలను గ్రామ పంచాయతీలు చేయాలని ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు జరిగాయని తెలిపారు. 50 ఏండ్లు ఉద్యమించినా కాంగ్రెస్ కనికరించలేదని చెప్పారు. ‘మా తండాలో మా రాజ్యం’ పోరాటంలో తానూ పాల్గొన్నానని వెల్లడించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే తండాల్లో, గూడేల్లో పాతరోజులు వస్తాయని తెలిపారు.
కేసీఆర్ లేకుంటే మన తండాల్లో మన రాజ్యం వచ్చేదా?
తండాలను గ్రామ పంచాయతీలు చేయాలని దశాబ్దాలుగా ఉద్యమాలు చేశామని, కానీ ఏనాడైనా కాంగ్రెస్ కనికరించిందా? అని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం అయిన వెంటనే తండాలను పంచాయతీలు చేశారని చెప్పారు. కేసీఆర్ లేకుంటే మన తండాల్లో మన రాజ్యం వచ్చేదా? అని అడిగారు. రూ.4 వేల కోట్లతో ప్రతి తండాకు రోడ్లు వేసుకున్నామని చెప్పారు. కుమ్రంభీం, సేవాలాల్ జయంతి, వర్ధంతిని అధికారికంగా జరుపుకుంటున్నామని గుర్తుచేశారు. సమావేశంలో ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎంపీ, ప్రొఫెసర్ సీతారాంనాయక్, జడ్పీ చైర్మన్లు బిందు, రాంచంద్రనాయక్, ట్రైకార్ చైర్మన్ వాల్యానాయక్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు సూరయ్య, కృష్ణప్రసాద్, లోకిని రాజు, రాజునాయక్, శంకర్‌నాయక్, రమణనాయక్, సంజీవ్‌నాయక్, రూప్సింగ్, రవినాయక్, రాంబల్, ఎరుకుల సంఘం అధ్యక్షుడు రాములు, మేయర్ దుర్గాదేవి, రామస్వామి నాయక్, భవాని తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే మన నీళ్లను కర్ణాటకకు మళ్లిస్తరు
కాంగ్రెస్‌కు ఓటేస్తే మన నీళ్లను కర్ణాటకకు మళ్లిస్తరని, ఐటీ కంపెనీలు, పరిశ్రమలను బెంగళూరుకు తీసుకెళతారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్‌ను కర్ణాటక కాంగ్రెస్ శాసిస్తున్నదని చెప్పారు. టికెట్లు ఇవ్వాలంటే కర్ణాటక వాళ్లు.. ఓటర్లకు డబ్బులు ఇవ్వాలంటే కర్ణాటక కాంగ్రెస్ వాళ్లు.. ప్రచారం కోసం కర్ణాటక సీఎం, ఉప ముఖ్యమంత్రి వస్తున్నారని వెల్లడించారు. రైతు రుణమాఫీ ఇచ్చామని, మిగతా రూ.4 వేల కోట్లు సైతం ఈసీ అనుమతి ఇస్తే వారం, పదిరోజుల్లోనే పూర్తి చేస్తామని తెలిపారు. రైతులకు రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ అడ్డుకుంటున్నదని ఆరోపించారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే తండాలు, గూడేలు మరింత అభివృద్ధి చెందుతాయని వెల్లడించారు. హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించినట్టే.. ప్రతి గిరిజన పంచాయతీలో సేవాలాల్, కుమ్రం భీం భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.