Water Problems | కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 8: కూకట్పల్లి నియోజకవర్గం.. హైదరాబాద్‌లో అత్యంత జనసమ్మర్థం ఉండే ప్రాంతం. ఆసియాలోనే అతి పెద్దదైన కాలనీలో తాగునీటి సమస్య తలెత్తింది. దూప తీర్చుకునేందుకు చుక్కనీరు లేని పరిస్థితి ఏర్పడింది. అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఎంత మందికి మొరపెట్టుకున్నా వారి సమస్య పరిష్కారం కాలేదు. ఇక లాభం లేదనుకొని నేరుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి విన్నవించాలని నిశ్చయించుకున్నారు. అలా చేస్తేనే తమ సమస్య పరిష్కారమవుతుందని భావించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన గుమ్మడి నర్సయ్యకే ప్యాలెస్‌లోకి అనుమతి ఇవ్వలేదు. ఇక తమలాంటి సామాన్యులను ప్యాలెస్ దరిదాపుల్లోకి కూడా రానివ్వరని వారికి అర్థమైంది. ఎట్టకేలకు వనపర్తి జిల్లా కేంద్రంలో ఓ కార్యక్రమానికి సీఎం వెళ్తున్నారని వారు తెలుసుకున్నారు. కాలనీకి చెందిన విమలజ్యోతి అనే గృహిణి ద్వారా వనపర్తికి వెళ్లి మరీ కేపీహెచ్‌బీ తాగునీటి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తమ దాహార్తిని తీర్చాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. ఏ మాత్రం లెక్కచేయని సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాభవన్‌కు వెళ్లి వినతిపత్రం ఇవ్వాలని కులాసాగా చెప్పారు.
ఇప్పటికే అధికారులు మొదలుకొని ప్రజాప్రతినిధుల వరకు, స్థానిక కార్యాలయాలు మొదలుకొని ప్రజాభవన్ వరకు వినతిపత్రాలు ఇచ్చిన వారు మళ్లీ అక్కడికే వెళ్లాలా? అని నిశ్చేష్టులయ్యారు. అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని నేరుగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేస్తే, క్షణాల్లో తమ సమస్య పరిష్కారమవుతుందని భావించిన కాలనీవాసులు రేవంత్‌రెడ్డి చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయారు. ఒక్క ఫోన్ చేసి, నిమిషాల్లో పరిష్కరించాల్సిన సమస్యను మళ్లీ మొదటికి తెచ్చారని మండిపడ్డారు. చేసేదేమీ లేక శుక్రవారం ప్రజాభవన్‌కు వెళ్లారు. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి వినతిపత్రం అందించారు. కాలనీవాసుల ఫిర్యాదుతో జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. నివేదిక సిద్ధం చేసి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కేపీహెచ్‌బీ కాలనీ తాగునీటి సమస్య వనపర్తికి వెళ్లి అక్కడి నుంచి బేగంపేటలోని ప్రజాభవన్‌కు చేరింది.
హైదరాబాద్ నగరంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఎండలు పెరగడం, భూగర్భజలాలు అడుగంటుతుండటంతో నగరంలోని అనేక కాలనీలు నీటిఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. చాలాచోట్ల తక్కువ సమయం నీళ్లు సరఫరా చేస్తుండటం, లోప్రెజర్ వల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాటిలో కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ కాలనీ ఒకటి. ఈ కాలనీలో గతంలో గంటకు పైగా హైప్రెజర్‌తో నీటిని వదిలేవారు. కానీ, కొన్ని రోజులుగా 30-40 నిమిషాలు మాత్రమే వదులుతున్నారు. అది కూడా లోప్రెజర్‌తో సరఫరా చేస్తున్నారు. ఇండ్లల్లోని బోర్లు ఎండిపోవడంతో నల్లా నీళ్లు సరిపోక కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చిన నీళ్లను సరఫరా చేయడం తప్ప తామేమీ చేయలేమని జలమండలి అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం దృష్టికి వారు తమ సమస్యను తీసుకువెళ్లారు. ప్రజాభవన్‌లో వినతిపత్రం ఇచ్చారు. అధికారుల ఆదేశాల మేరకు జలమండలి అధికారులు కాలనీని పరిశీలించారు. పది రోజుల్లో నివేదిక సమర్పిస్తామని అధికారులు చెప్పినట్టు కాలనీ సంఘం జనరల్ సెక్రటరీ లక్ష్మారెడ్డి తెలిపారు.