హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడంలో తీవ్రజాప్యం చేయడం కాంగ్రెస్ పాలకులకు పరిపాటిగా మారింది. కాంగ్రెస్ పాలనలోనే స్థానిక ఎన్నికలకు ఇలా ఏండ్లకేండ్లు బ్రేకులు పడటం సహజంగా మారింది. స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు తీరినా ఎన్నికల నిర్వహణలో జాప్యం చేయడం ఆ పార్టీ పాలనలో ఇది మూడోసారి కావడం గమనార్హం. గతంలో కాంగ్రెస్ హయాంలోనే 1992-1996 వరకు, 2011-2014 వరకు స్థానిక ఎన్నికలను నిర్వహించడంలో తీవ్ర ఆలస్యమైంది. హస్తం పార్టీ నిర్లక్ష్య చరిత్ర ఇప్పుడు రేవంత్‌రెడ్డి హయాంలోనూ మరోసారి పునరావృతమైంది. 2024 ఫిబ్రవరి ఒకటిన గ్రామ పంచాయతీల పాలకవర్గాలు ముగిసినా, నేటికీ ఎన్నికలు జరపకపోవడం, స్థానిక ఎన్నికలపై పార్టీ నిరాసక్తతను బయటపెడుతున్నది.
దీంతో ప్రజాప్రతినిధులు లేని పంచాయతీలుగా మార్చారు. ఫలితంగా మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు మొట్టికాయలు వేసే పరిస్థితిని కాంగ్రెస్ పాలకులు తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1992 నుంచి 1994 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 1992 సెప్టెంబర్ 20 నుంచి 1994 డిసెంబర్ 12 వరకు కాంగ్రెస్ నాయకుడు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అనంతరం 1994లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపు నాలుగేండ్లపాటు ఆలస్యమయ్యాయి. 1992లో జరగాల్సిన ఎన్నికలు 1995-1996 వరకు వాయిదా పడ్డాయి. తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత టీడీపీ స్థానిక ఎన్నికల నిర్వహణలో తాత్సారం చేశాయి.
మళ్లీ చరిత్ర పునరావృతం
2011 నుంచి 2014 వరకు మళ్లీ అదే చరిత్ర పునరావృతమైంది. ఈ కాలంలో కూడా స్థానిక ఎన్నికలు మూడేండ్లపాటు ఆలస్యమయ్యాయి. 2011లో జరగాల్సిన ఎన్నికలు 2014 వరకు జరగనేలేదు. ఈ కాలంలో కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి 2010 నవంబర్ 25 నుంచి 2014 మార్చి 1 వరకు ఉన్నారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన చర్చలు ఈ ఆలస్యానికి కారణాలుగా ఆనాడు చూపారు.
బీఆర్ఎస్ పాలనలో సజావుగా ఎన్నికలు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ షెడ్యూల్ ప్రకారమే స్థానిక ఎన్నికలను నిర్వహించింది. 2014-2023 మధ్య టీఆర్ఎస్ పాలనలో స్థానిక ఎన్నికలు సాపేక్షంగా క్రమం తప్పకుండా జరిగాయి. 2019లో జిల్లా పరిషత్ (జడ్పీటీసీ), మండల పరిషత్ (ఎంపీటీసీ) ఎన్నికలను మూడు విడతల్లో (మే 6, మే 10, మే 14) నిర్వహించారు. ఈ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరిగాయి.
మళ్లీ కాంగ్రెస్ పాలనలో అదే తంతు
కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు కూడా అదే తంతు కొనసాగుతున్నది. రాష్ట్రంలో 2024 ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగిసినప్పటికీ 2025 జూలై వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనేలేదు. ప్రజాప్రతినిధులను ఎన్నుకొనే హకు కాలందాటిపోతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదు. కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్ల ఖరారు, బడ్జెట్ సమావేశాలు, పదో తరగతి పరీక్షల వంటి కారణాలతో జాప్యం చేస్తూ వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పడకేయడంతో తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని ఇటీవలే ఆదేశించింది.
ఐదేండ్లకోసారి ఎన్నికలు నిర్వహించాలి
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతీ ఐదేండ్లకోసారి క్రమం తప్పకుండా నిర్వహించడం ప్రభుత్వాల బాధ్య త. భారత రాజ్యాంగంలోని 73వ, 74వ సవరణల ప్రకారం 1992లో ఆమోదించబడిన పంచాయతీరాజ్ చట్టం తర్వాత తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తూ వస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించాలి.