జనగామ, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మాజీ కౌన్సిలర్లు ఆదివారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. జనగామ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 24వ వార్డు మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గంగరబోయిన మల్లేశం, 6వ వార్డు మాజీ కౌన్సిలర్ బక తుకారాం, 9వ వార్డు మాజీ కౌన్సిలర్ గుణగంటి రామకృష్ణ, సరోజా తమ అనుచరులు, కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరగా, వారికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీతోనే జనగామ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రెండు సంవత్సరాలుగా తన సొంత నీలిమా దవాఖానలో ఉచిత వైద్యం అందిస్తున్నానని, ఈ సేవలను రానున్న మూడు సంవత్సరాలు కొనసాగిస్తానని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.